జగన్ పార్టీకి మోత్కుపల్లి అస్త్రం: చంద్రబాబుపై మాటల తూటాలు

Sudhakar bbau lashes out at Chnadrababu
Highlights

తెలంగాణ తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై మాటల తూటాలు విసరడానికి అస్త్రాన్ని అందించారు. 

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై మాటల తూటాలు విసరడానికి అస్త్రాన్ని అందించారు. మోత్కుపల్లి నర్సింహులు చేసిన ఆరోపణలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెసు అధికార ప్రతినిధి టిజేఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. 

మోత్కుపల్లి నర్సింహులు ఆరోపణలు చేస్తే సమాధానాలు చెప్పారా, చెప్పలేకపోయారని, అంటే మోత్కుపల్లి ఆరోపణలను అంగీకరించినట్లేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, వర్ల రామయ్య బహిరంగంగా దళితులను అవమానించారని, వారి నుంచి కనీసం చంద్రబాబు వివరణ అడగలేదని ఆయన అన్నారు. 

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై మహానాడులో తీర్మానాలు చేశారా అని ఆయన ప్రశ్నించారు. భోజనాలు చేయడానికే మహానాడు పెట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హిట్లర్ పుట్టిన ఏప్రిల్ 20వ తేదీన చంద్రబాబు పుట్టారని, హిట్లర్ లాగే వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో దళితుల భూములు స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ పనిలో కూడా సామాజిక న్యాయం చేయలేదని అన్నారు. 

చంద్రబాబు పిట్టల దొర కాదని, దొంగ కాదని తాము అంగీరిస్తున్నామని, అయితే చంద్రబాబు భయంకరమైన వ్యక్తి అని మోత్కుపల్లి అంటున్నారని, మోత్కుపల్లికి సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. 

మహానాడు వేదిక మీది నుంచి తెలిసీతెలియకుండా జగన్ మీద కొంత మంది మాట్లాడుతుంటే చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారని, అది చంద్రబాబు పైశాచికత్వానికి నిదర్శనమని అన్నారు. నర్సిరెడ్డీ.. .జాగ్రత్త... నోటి నుంచి మాట వచ్చిన వచ్చినప్పుడు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకో అని అన్నారు. 

నేనే పెద్ద మాదిగ అన్నప్పుడు చంద్రబాబు పక్కన మోత్కుపల్లి ఉన్నరని, మోత్కుపల్లికి సమాధానం చెప్పుకోవాలని అన్నారు. మాలమాదిగలను విడదీసి ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూశారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న దళిత నాయకులు కళ్లు తెరవాలని, ముఖ్యమంత్రిని నిలదీయాలని, ఆ పార్టీలో కొనసాగాల్సిన అవసరం ఉందా అని ఆలోచించాలని అన్నారు. టీడిపికి రాజీనామా చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

loader