చిక్కుల్లో రవితేజ 'టైగర్ నాగేశ్వరావు'... స్టువర్టుపురం గ్రామస్తుల స్ట్రాంగ్ వార్నింగ్
రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాకు వ్యతిరేకంగా స్టువర్టుపురం గ్రామస్తులు ఆందోళనకు సిద్దమయ్యారు.

విజయవాడ : హీరో రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 20న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. కానీ ఇది అంత ఈజీగా జరిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ సినిమాపై ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా ఈ సినిమా విడుదలను ఆపాలంటూ బాపట్ల జిల్లా స్టువర్టుపురం గ్రామస్తులు ఆందోళనకు సిద్దమయ్యారు.
తమ గ్రామాన్ని, ఎరుకల జాతిని కించపర్చేలా తెరకెక్కించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలను అడ్డుకుంటామని స్టువర్టుపురం గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఎరుకల కులానికి చెందిన నాగేశ్వరరావును గజదొంగగా చూపించడంతో పాటు స్టువర్టుపురం గ్రామస్తులంతా దొంగలే అనేలా సినిమా తీసారని ఆరోపించారు.
ఇప్పటికే విడుదలచేసిన టైగర్ నాగేశ్వరరావు సినిమా టీజర్ వాడిన బాషపై కూడా స్టువర్టుపురం గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సినిమాను ఆపాలంటూ స్టువర్టుపురం గ్రామస్తులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం టైగర్ నాగేశ్వరరావు సినిమాపై అసహనం కూడా వ్యక్తం చేసింది. ఇలాంటి టీజర్స్ ద్వారా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మూవీ యూనిట్ ను హైకోర్టు ప్రశ్నించింది.
ఏపీ హైకోర్టు చురకలు అంటించినా టైగర్ నాగేశ్వరావు మూవీ విడుదలకు సిద్దమవుతున్నారంటూ స్టువర్టుపురం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేసారు. సినిమాని ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇలా స్టువర్టుపురం గ్రామంలో వుండేవారంతా దొంగలేనని చూపించిన సినిమాల ద్వారా ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నామని... ఇప్పుడు మళ్ళీ తమను అవమానిస్తూ మరో సినిమా వస్తుందన్నారు. ఈ టైగర్ నాగేశ్వరరావు సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల కానివ్వబోమని స్టువర్టుపురం గ్రామస్తులు హెచ్చరించారు.
Read More సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు... టైగర్ నాగేశ్వరరావు టీజర్ పై హైకోర్టు అసహనం!
టైగర్ నాగేశ్వరరావు సినిమా గురించి తమను దర్శక నిర్మాతలే కాదు మూవీ యూనిట్ కు సంబంధించిన ఎవ్వరూ సంప్రదించలేదని స్టువర్టుపురం గ్రామస్తులు అంటున్నారు. తమ గ్రామాన్ని,ఎరుకల జాతిని అవమానించేలా వున్న సన్నివేశాలు, బాషను తొలగించాలని కోరుతున్నారు. స్టువర్టుపురం గ్రామాన్ని దక్షిణ భారతదేశ నేర రాజధానిగా చూపించడం దారుణమని అంటున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల ఇప్పటికే స్టువర్టుపురంకు చాలా చెడ్డపేరు వచ్చిందన్నారు. ఇకపై తమ గ్రామాన్ని కించపరిస్తే ఊరుకోబోమని స్టువర్టుపురం గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
టైగర్ నాగేశ్వరరావు మూవీలో రవితేజకు జంటగా నుపుర్ సనన్ నటిస్తుంది. నటి రేణూ దేశాయ్ ఈ చిత్రంతో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఆమె కీలక రోల్ లో నటించారు. మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ వంటి సీనియర్ యాక్టర్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.