సారాంశం


టైగర్ నాగేశ్వరరావు టీజర్ పై ఏపీ హైకోర్ట్ సీరియస్ అయ్యింది. టీజర్ లో భాష అభ్యంతరకరంగా ఉందని వెల్లడించింది. 
 

రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు చిత్రం తెరకెక్కుతుండగా ఇటీవల టీజర్ విడుదల చేశారు. టైగర్ నాగేశ్వరరావు టీజర్లో వాడిన భాష ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. సరైన అనుమతులు తీసుకోకుండా ఎలా  విడుదల చేస్తారని మండిపడింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనుమతి లేకుండా టీజర్ విడుదల చేయడంపై అభ్యంతరం తెలిపింది. ఇలాంటి టీజర్స్ ద్వారా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. 

సినిమా మేకర్స్ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి. కేవలం డబ్బుల కోసం సినిమాలు తీయడం సరికాదని చెప్పింది. ఈ మేరకు టైగర్ నాగేశ్వరరావు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి నోటీసులు జారీ చేసింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్ పర్సన్ ని ప్రతివాదిగా చేర్చాలని సూచించింది. అలాగే సినిమాపై పిటీషనర్ కి ఉన్న అభ్యంతరాలు అన్నింటినీ సీబీఎఫ్సీ చైర్ పర్సన్ కి తెలియజేసేలా అనుమతి ఇచ్చింది. 

ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ ఠాకూర్, న్యాయమూర్తి ఆకుల శేష సాయి మూర్తి ఆదేశాలు ఇచ్చారు. టైగర్ నాగేశ్వరరావు మూవీ టీజర్ ఎరుకల సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతీసేదిగా ఉందని చుక్కా పాల్ అనే వ్యక్తి  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 

ఇక ఈ చిత్ర విడుదల నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఒకప్పుడు దేశాన్ని వణికించిన స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది టైగర్ నాగేశ్వరరావు. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్నారు. దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు. 

టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. టైగర్ నాగేశ్వరరావు మూవీలో రవితేజకు జంటగా నుపుర్ సనన్ నటిస్తుంది. నటి రేణూ దేశాయ్ ఈ చిత్రంతో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఆమె కీలక రోల్ లో నటించారు. మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ భాగమయ్యారు. అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.