సెల్ టవర్ ఎక్కిన విద్యార్ధులు

First Published 26, Nov 2017, 5:51 PM IST
Students threaten to commit suicide and climbed cell tower
Highlights
  • తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్ధులు గుణదలలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు.

తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్ధులు గుణదలలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. విద్యార్ధులు సెల్ టవర్ ఎక్కటమన్నది విజయవాడ చుట్టుపక్కల సంచలనంగా మారింది. ఇంతకీ జరిగిందేమంటే, కడప ఫాతిమా మెడికల్ కళాశాలలో సౌకర్యాలు లేని కారణంగా ఎంసిఐ విద్యార్ధుల అడ్మిషన్లను రద్దు చేసింది. యాజమాన్యం చేసిన తప్పుకు తమ అడ్మిషన్లను రద్దు చేస్తే తమ భవిష్యత్తు ఏంటనే విద్యార్ధుల ప్రశ్నకు ఎవరూ సమాధానం ఇవ్వటం లేదు.

అందుకనే విద్యార్ధులు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. తమ భవిష్యత్తు కోసం విద్యార్ధులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కలిసినా ఉపయోగం కనబడలేదు. చివరకు కోర్టుకు కూడా వెళ్లినా నిరాశే ఎదురైంది. దాంతో విద్యార్ధులు విజయవాడకు వచ్చి నిరాహారదీక్ష మొదలుపెట్టారు. యాజమాన్యం కూడా విద్యార్ధులను అర్ధాంతంరంగా బయటకు పంపేసింది. దాంతో విద్యార్ధులందరూ ఒక్కసారిగా రోడ్డున పడ్డారు.

ఎన్ని ఆందోళనలు చేసినా ఉపయోగం కనబడకపోవటంతో చివరకు వేరే దారిలేక విద్యార్ధుల్లో ఐదుమందితో పాటు ఓ విద్యార్ధి తండ్రి కూడా విజయవాడకు సమీపంలోని గుణదలలో ఉన్న పెద్ద సెల్ టవర్ ఎక్కేసి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారు సెల్ టవర్ ఎక్కుతున్న విషయం తెలియగానే పోలీసులు స్పందించారు. అయితే, పోలీసులు ఎంత చెప్పినా దిగిరావటం లేదు. చంద్రబాబునాయుడు హామీలపై తమకు నమ్మకం పోయింది కాబట్టే తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ నినాదాలు చేస్తున్నారు.

విషయం తెలిసి అక్కడకు కలెక్టర్ లక్ష్మీకాంతం కూడా చేరుకున్నారు. చంద్రబాబుతో భేటి ఏర్పాటు చేస్తామని కలెక్టర్ లక్ష్మీకాంతం ఎంత చెప్పినా వినటం లేదు. దాదాపు మూడు గంటలుగా సెల్ టవర్ పైనే ఉన్న విద్యార్ధులు ఎప్పుడేం చేసుకుంటారో అన్న టెన్షన్ మొదలైంది అందరిలోనూ.

 

loader