కొందరు విద్యార్ధులపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నా మొత్తం విద్యార్ధిలోకమే ఏకమవుతుందన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు.
విద్యార్ధిలోకాన్ని చంద్రబాబునాయుడు దూరం చేసుకుంటున్నారు. ప్రత్యేకహోదా డిమాండ్ చేసిన వారిపై గతంలోనే ప్రభుత్వం కన్నెర్ర చేసింది. హోదాపై మాట్లాడే విద్యార్ధులపై పిడి యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం గతంలోనే చెప్పింది. జగన్మోహన్ రెడ్డి సభలకు పిల్లలను పంపవద్దని బహిరంగ చంద్రబాబు చెప్పటం అప్పట్లో పెద్ద దుమారాన్నేరేపింది. జగన్ సభలకు హాజరైన విద్యార్ధులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలివ్వటం కూడా పెద్ద గందరగోళానికి దారితీసింది. అయితే, అప్పట్లో కేవలం ఆదేశాలకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వం ఇపుడు చేతల్లో చూపిస్తోంది.
గుంటూరులో ఇటీవలో ప్రత్యేకహోదాపై జగన్ సభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొన్న సాయి అనే విద్యార్ధిని కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. చిలకలూరిపేటకు చెందిన ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలో సాయి చదువుతున్నాడు. యువభేరిలో పాల్గొన్న సాయి చంద్రబాబుపై విమర్శలు చేసారు. ప్రత్యేకహోదా కావాల్సిందేనంటూ గట్టిగా డిమాండ్ చేసారు. అయితే, సదరు కళాశాల టిడిపి సానుభూతిపరులకు సంబంధించినది. దాంతో టిడిపి నేతలు ఒత్తిడి పెట్టి విద్యార్ధిని సస్పెండ్ చేయించారు.
ఎప్పుడైతే విషయం బయటపడిందో వెంటనే వైసీపీ నేతలు కళాశాల యాజమాన్యాన్ని కలిసారు. దానికితోడు అప్పటికే కళాశాల విద్యార్ధులందరూ యాజమాన్యానికి వ్యతిరేకంగా తయారయ్యారు. దాంతో కళాశాల యాజమాన్యం వెనక్కు తగ్గింది. జరుగుతున్న ఘటనలను బట్టి చంద్రబాబు ప్రభుత్వం విద్యార్ధి లోకానికి దూరమవుతున్నట్లే కనబడుతోంది. కొందరు విద్యార్ధులపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నా మొత్తం విద్యార్ధిలోకమే ఏకమవుతుందన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు. బహుశా ప్రత్యేకహోదాపై ఎవరు మద్దతు ప్రకటించినా వారందరిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లే కనబడుతోంది.
