మంత్రివర్గం నుండి ఏవి వర్గంలోకి..అఖిలకు షాక్

First Published 5, Apr 2018, 5:03 PM IST
Strong supporters of akhila join hands with rival av subbareddy
Highlights
కర్నూలు జిల్లా టిడిపిలో మంత్రి భూమా అఖిలప్రియకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

కర్నూలు జిల్లా టిడిపిలో మంత్రి భూమా అఖిలప్రియకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సొంతపార్టీ నేతలే మంత్రివర్గాన్ని పూర్తిగా బలహీన పరుస్తున్నారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండలం పేరూరు గ్రామంలో గురువారం మంత్రికి గట్టి మద్దతుదారులైన పలువురు ఎంపిటిసిలు, ఓ జడ్పిటిసీతో పాటు 300 మంది కార్యకర్తలు ఏవి సుబ్బారెడ్డి వర్గంలోకి వెళ్ళిపోయారు.

 ఇటు నియోజకవర్గంలోను అటు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర పార్టీలో కూడా దాదాపు ఒంటరైపోయారు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో హటాత్ పరిణామాలతో మంత్రిలో టెన్షన్ మొదలైంది.

తన స్వయంకృతం వల్లే పరిస్ధితులు ఇలా తయారైందని అంగీకరించటానికి అహం అడ్డువస్తుండటంతో మంత్రి తరపున పరిస్ధితులను చక్కదిద్దే వారు కూడా కనబడటం లేదు. దాంతో అయిన వారు కాని వారని కాకుండా ప్రతీ ఒక్కరూ పార్టీలో అఖిలకు శతృవులుగా మారిపోతున్నారు.

అందుకు ఇటీవల పార్టీలో సంభవిస్తున్న పరిణామాలే నిదర్శనాలు. నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లో బాగా పట్టున్న ఏవి సుబ్బారెడ్డికి మంత్రికి పడదు. అదేవిధంగా పార్టీలో సీనియర్ నేతైన ఇరిగెల రాంపుల్లారెడ్డితో కూడా అఖిలకు ఏమాత్రం పొసగదు.

అందుకనే ఏవి అయినా ఇరిగెల అయినా వచ్చే ఎన్నికల్లో మంత్రిని కాదని తమకే టిక్కెట్లు ఇవ్వాలంటూ చంద్రబాబునాయుడు వద్ద పట్టుపడుతున్నారు. ఇక, మంత్రివర్గంలో కానీ రాష్ట్రస్ధాయిలో కానీ సీనియర్లు కొందరు ఏవికి ఇరిగెలకు బాగా మద్దతిస్తున్నారు. అంటే అందరూ కలిసి అఖిలను దాదాపు దూరం పెట్టినట్లే అర్ధమవుతోంది.

మిగిలిన వాళ్ళ సంగతి దాకా ఎందుకు? సొంత మేనమామ కర్నూలు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డితోనే అఖిలకు పడదంటే మంత్రి వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. దాంతో వచ్చే ఎన్నికల్లో అసలు అఖిలకు ఆళ్ళగడ్డలో పోటీ చేసేందుకు టిక్కెట్టు రాదేమో అన్న అనుమానాలు బాగా ప్రచారం జరుగుతోంది.

 

loader