మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయన్న భయం ప్రతి ఒక్కరిలోనూ కలగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఆయన గుంటూరులోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న దాచేపల్లి అత్యాచార బాధిత చిన్నారిని ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కామాంధులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

ఆంబోతుల మాదిరి బజారున పడితే సహించేది లేదన్న ఆయన ఆడవారి జోలికెళ్తే ప్రాణాలమీద ఆశలు వదులుకోవాల్సిందేనని హెచ్చరించారు. దాచేపల్లిలో దుర్ఘటన మానవత్వానికే మాయని మచ్చ అని.. ఈ దురాగతాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. ఈ విషయం తెలియగానే చాలా బాధపడినట్లు చెప్పారు. చిన్నారి తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతమన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకు పాల్పడేవారికి అదే ఆఖరి రోజు అవుతుందని హెచ్చరించారు. భవిష్యత్తుల్లో ఇలాంటి ఘటనలపై మరింత కఠినంగా ఉంటామని చెప్పారు.

బాధిత కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత బాలిక పూర్తి బాధ్యతలను తానే స్వయంగా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పటికే బాధిత కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చామని.. మరో రూ.5లక్షలు కూడా అందజేస్తామని తెలియజేశారు. వాటిని బాలిక పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తామని తెలిపారు.

ప్రతిపక్ష నేతలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బురదలో ఉండి వాటిని ఇతరుల మీద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.