పలాస: పోలీసులను చూసి భయంతో ఓ వాహనాన్ని వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. ఈ వాహనంలో పెద్ద ఎత్తున గంజాయి ఉందని చివరికి పోలీసులకు గుర్తించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటు చేసుకొంది.

పలాస మండలం లక్ష్మీపురం జాతీయ రహదారి టోల్‌ప్లాజా ప్రాంతంలో మంగళవారం నాడు మధ్యాహ్నం పోలీస్ వాహనాన్ని చూసిన ఓ వ్యాన్ డ్రైవర్ శ్రీకాకుళం నుండి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న బోలేరో వ్యాన్ ను రోడ్డుపైనే నిలిపివేసి పారిపోయాడు.

పోలీసులు ఈ వ్యాన్ ను తనిఖీ చేస్తే అందులో గంజాయి దొరికింది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రిజిస్ట్రేషన్ తో ఈ వ్యాన్ ఉంది.  వ్యాన్ వెనుక కింది భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన ట్రేలో 63 ప్యాకెట్లలో గంజాయిని తరలిస్తున్నట్టుగా గుర్తించినట్టుగా కాశీబుగ్గ సీఐ శంకర్ రావు తెలిపారు.

స్వాధీనం చేసుకొన్న గంజాయి విలువ సుమారు. 5 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.