ఏలూరు: 2017 జనవరి 18వ తేదిన పశ్చిమగోదావరి జిల్లా  నరసాపురం-పాలకొల్లు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదం మరణించిన శ్రీగౌతమి కేసు విచారణ చివరి దశలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో  టీడీపీ నేత సజ్జా బుజ్జి పాత్ర ఉందని  మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని  కుటుంబసభ్యులు  చెబుతున్నారు.ఈ కేసులో కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. రెండు మూడు రోజుల్లో నిందితులను అరెస్ట్ చూపించనున్నారని సమాచారం.

2017 జనవరి 18వ తేది రాత్రి నరసాపురం-పాలకొల్లు మార్గంలో  స్కూటీపై  ఇంటికి వస్తున్న అక్కా చెల్లెళ్లు శ్రీగౌతమి, పావనిలను వెనుక నుండి ఇన్నోవా వాహనం ఢీకొట్టింది.  వారిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా శ్రీగౌతమి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె చెల్లి పావని ప్రాణాపాయం నుండి బయటపడింది.

తొలుత ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా భావించారు. కానీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్పృహలోకి వచ్చిన  శ్రీగౌతమి చెల్లి పావని  మాత్రం సంచలన విషయాలను వెల్లడించారు.  టీడీపీ నేత సజ్జా బుజ్జి తమపై హత్యా ప్రయత్నం చేశాడని  పావని చెప్పింది. తన అక్కను బుజ్జి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని అప్పటి వరకూ తన తల్లికి కూడా తెలియని విషయాన్ని బయటపెట్టింది. పెళ్లి ఫొటోలను కూడా విడుదల చేసింది. బుజ్జిని అరెస్ట్‌ చేయాలంటూ తీవ్ర గాయాలతోనే పోరాటం చేసింది. ఆమెకు మద్దతుగా రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు నిలిచాయి.

15 రోజుల్లోనే యాక్సిడెంట్‌ కేసుగా చెప్పి పోలీసులు కేసు క్లోజ్‌ చేశారు. విశాఖపట్టణంకు చెందిన పాకాల సందీప్, కడియం దుర్గాప్రసాద్‌లు యాక్సిడెంట్‌ చేశారని అరెస్ట్‌ చూపించారు. సందీప్‌ కొత్తకారు కొనుక్కుని కోడి పందాల కోసం భీమవరం వచ్చాడని తిరిగి వెళ్లేప్పుడు, స్కూటీపై వెళుతున్న గౌతమి, పావనిల వెంటపడి మద్యం మత్తులో ప్రమాదం చేశారని తేల్చారు.

ఈ కేసును మూసివేయడంపై  పావని  పోరాటం చేసింది. డీఐజీ, డీజీపీలతో పాటు సీఐడీకి కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసును రీ ఓపెన్ చేసి  విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. కొన్ని నెలలుగా రాజమండ్రి సీఐడీ అధికారులు కేసును దర్యాప్తు చేస్తూ వచ్చారు. ఈ దర్యాప్తులో శ్రీగౌతమిది హత్యేనని తేలిందని పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

ఇందులో అమెను రెండోపెళ్లి చేసుకున్న టీడీపీ నేత ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు ఆధారాలు  సంపాదిచినట్టు సమాచారం. యాక్సిడెంట్‌ చేసిన వారి ఖాతాలలో రెండుసార్లు పెద్ద మొత్తంలో డబ్బులు వేసినట్లు గుర్తించారు. మా అక్కను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని పావని కోరుతున్నారు.