తిరుపతి: కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ యువకుడు కోవిడ్ టెస్టు కోసం వచ్చి సంజీవిని బస్సు వద్ద కుప్పకూలి మరణించిన సంఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. అయితే కొడుకు చనిపోయిన విషయం తెలియక ఆ శవాన్ని కదుపుతూ మృతుడి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్నవారికీ కంటతడి పెట్టించింది. ఆ తండ్రి అమాయకంగా బిడ్డ ఒళ్లు పడుతూ, ఛాతీని ఒత్తుతూ బ్రతికించుకునే ప్రయత్నం చేయడం చూసి చూసేవారికే ఎంతో బాధ కలిగించింది.  

ఈ ఘటన ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబును కలచివేసినట్లుంది. అందువల్లే ఆయన కూడా ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికన స్పందిస్తూ ఆ తండ్రికి ఎవరు సమాధానం చెబుతారు? అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

''''అరగంటలో బెడ్ కేటాయిస్తే" తన బిడ్డకీ చావు వచ్చేది కాదంటూ గొల్లుమంటున్న ఆ తండ్రికి ఎవరు సమాధానం ఇస్తారు? మనసు కలుక్కుమనే మరో దుర్ఘటన ఇది! తిరుపతి, సప్తగిరి నగర్ కు చెందిన శేఖర్,  3రోజులుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా అతనికి సకాలంలో సరైన చికిత్స అందించలేకపోయారు'' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

''రోజుల తరబడి పరీక్షా ఫలితాల్లో జాప్యం.. ఫోన్ చేసినా గంటల తరబడి రాని అంబులెన్స్ లు.. బెడ్స్ లేక చెట్ల కిందే రోగులు, మార్చురీలో మృతదేహాల కుప్పలు..ఇంతకన్నా ఘోర వైఫల్యాలు ఇంకేముంటాయి..? రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారడం బాధాకరం'' అంటూ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.