హైదరాబాద్: ప్రముఖ గాయకుడు ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం కూడా గళం ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెసుకు ఎస్బీ బాలు ఓ ముఖ్యమైన పాటను ఆలపించారు. అదంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆ పాటంటే ఎంతో ఇష్టమట

జనం కోసం జగన్ ఎత్తి జెండా వైఎస్సార్/ జనం ోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్సార్ అనే ఆ పాటను ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాట జగన్ కార్యక్రమాల్లో ప్రజలను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే.

చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలోని నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొకటి ఆహుతిచ్చాననే పాట అంటే జగన్ కు ఎంతో ఇష్టమట. అందుకే దానికి అనుగుణంగానే మణిశర్మతో ఆ పాటకు ఆయన సంగీతం సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది.  

ఆ పాటను బాలసుబ్రహ్మణ్యంతో పాడించడానికి చేసిన ప్రయత్నాలను జగన్ ఇప్పుడు తన సన్నిహితుల వద్ద నెమరు వేసుకుంటున్నారట. బాలసుబ్రహ్మణ్యం పాడిన జనం కోసం పాట ప్రజల్లోకి అప్రతిహతంగా చొచ్చుకుపోయింది.

బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. బాలు సంగీత ప్రపంచానికి చేసిన సేవలను ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు.