మిగిలిన రాష్ట్రాల సంగతి దేవుడెరుగు ముందు తెలంగాణాలో పార్టీ సంగతేమిటో చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే, చెప్పుకోవటానికి పార్టీకి నేతలనేవారు పెద్దగా కనబడటం లేదు.

చంద్రబాబునాయుడు రెండుకళ్ల సిద్దాంతం లోకేష్ బాబుకు వారసత్వంగా వచ్చినట్లుంది. ఎవరైన తమ పెద్దల నుండి ఆస్తులు, అప్పులు వారసత్వంగా తీసుకుంటారు. కానీ లోకేష్ మాత్రం అదనంగా తండ్రి సిద్ధాంతాలను కూడా వారసత్వంగా అందిపుచ్చుకున్నారు. ధక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయటంపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలను ఆదేశించారు. గుంటూరులో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రసంగించారు.

ఆ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణాలో ప్రజాసమస్యలపై ప్రజల తరపున పోరాటాలు చేయాలంటూ నేతలకు పిలుపినిచ్చారు. అంటే, తెలంగాణాలో ఏమో ప్రభుత్వ విధానాలపై తమ పార్టీ పోరాటాలు చేయాలి. మరి ఏపిలో మాత్రం ప్రతిపక్షాలేవీ నోరు విప్పకూడదు. తెలంగాణాతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో తమ పార్టీ విస్తరించాలి, బలోపేతమవ్వాలి. రాష్ట్రంలోని వైసీపీతో పాటు మిగిలిన ప్రతిపక్షాలు బలహీనపడాలి. ప్రజాసమస్యలపై పోరాటాలు చేయటమన్నది అన్నీ రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలు చేస్తున్నదే.

మిగిలిన రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు పోరాటాలు చేయాలి, అందుకు తమ పార్టీ మద్దతుగా నిలవాలని అనుకుంటోంది. మరి ఏపి విషయానికి వచ్చేసరికి ప్రతిపక్షాలు అభివృద్ధి నిరోధకులా? ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాక్షసుడా? ప్రజాసమస్యలపై జగన్ నోరు విప్పకూడదా? మరి ప్రతిపక్షంగా వైసీపీ ఉన్నదెందుకు? భలేగుంది కదూ తండ్రి, కొడుకుల రెండు కళ్ళ సిద్ధాంతం. ఇక, ధక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని కొత్తగా లోకేష్ చెప్పడమేమిటో? తమిళనాడు, కర్నాటక, అండమాన్, నికోబార్ దీవుల్లో తమ పార్టీ విస్తరిస్తోందని పార్టీ నేతలు ఎప్పటి నుండో చెప్పుకుంటున్నారు కదా? అందుకే కదా పార్టీని జాతీయ పార్టీగా మార్చుకున్నది.

మిగిలిన రాష్ట్రాల సంగతి దేవుడెరుగు ముందు తెలంగాణాలో పార్టీ సంగతేమిటో చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే, చెప్పుకోవటానికి పార్టీకి నేతలనేవారు పెద్దగా కనబడటం లేదు. టిఆర్ఎస్ దెబ్బకు టిడిపి కుదేలైపోయింది. కెసిఆర్ ఉన్నంతవరకూ టిడిపికి ఎదిగే ఛాన్స్ లేదనే కదా తండ్రి, కొడుకులిద్దరూ పార్టీని స్ధానిక నేతలకు వదిలేసి విజయవాడలో కూర్చున్నది? ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాల్సింది నేతలు కాదు. ఆ పోరాటాలకు తండ్రి, కొడుకులే సారధ్యం వహిస్తే బాగుంటుంది కదా? తెలంగాణాలో పార్టీని బ్రతికించుకోలేకపోతే టిడిపి జాతీయ పార్టీ అన్న విషయం లెటర్ హెడ్లకు మాత్రమే పరిమితమైపోతుంది.