ఆస్తులు, డబ్బు కోసం మనిషి మృగంలా మారుతున్నాడు. కన్నతల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని, ఆత్మీయులను చంపేందుకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా ఆస్తిలో వాటా ఇవ్వలేదనే కోపంతో కన్న తండ్రిని దారుణంగా హత్య చేసేందుకు యత్నించాడో కొడుకు.

వివరాల్లోకి వెళితే..  మదనపల్లె పట్టణంలోని చలపతిరావు కాలనీకి చెందిన కుందాని భాస్కర్‌ అలియాస్‌ శవాల భాస్కర్‌(53) స్థానికంగా ఎవరైనా చనిపోతే ఆ మృతదేహాలను తీసుకెళ్లి ఖననం చేస్తూ, వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నాడు. 

ఇతనికి 9 మంది భార్యలు, 14 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఎనిమిదవ భార్య ఉషారాణిని 12 ఏళ్ల క్రితం హత్య చేసి భాస్కర్‌ జైలుకు వెళ్లాడు. కొంతకాలానికి బయట కొచ్చిన అతను కలకడకు చెందిన ఆదెమ్మను తొమ్మిదో పెళ్లి చేసుకున్నాడు.

అనంతరం అక్కడికే మకాం మార్చి గుజిరీ సేకరించి వచ్చే ఆదాయంతో జీవిస్తున్నాడు. అయితే కన్నబిడ్డలను ఏ మాత్రం పట్టించుకునేవాడు కాదు. ఈ నేపథ్యంలో రెండవ భార్య ప్రభావతి కొడుకు దినేష్‌ (23) చలపతిరావు కాలనీలో తండ్రి పేరిట ఉన్న 8 సెంట్ల ఆస్తిలో తనకూ భాగం పంచాలని భాస్కర్‌పై ఒత్తిడి చేశాడు.

తాను త్వరలో మదనపల్లెకు వస్తానని, ఆ రోజే దీనిపై మాట్లాడుతానని కొడుక్కి తండ్రి నచ్చ జెప్పాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మదనపల్లెకు వచ్చిన భాస్కర్, చలపతిరావు కాలనీలోని తన పాత ఇంటిలో ఒంటరిగా ఉండటం చూసి దినేష్‌ తన అనుచరులతో వెళ్లి ఆస్తి పంపకం విషయమై నిలదీశాడు.

అతను భూమిని పంచేందుకు ససేమిరా అనడంతో దినేశ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కత్తితో తండ్రిపై దాడిచేసి, గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయాడని భావించి పరారయ్యాడు.

కొంతసేపటికి తేరుకున్న భాస్కర్‌ రామ్‌నగర్‌లో ఉన్న మరో కొడుకు వద్దకు వెళ్లి స్పృహ కోల్పోయాడు. వారు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.