చంద్రబాబునాయుడుపై బిజెపి ఎంఎల్సీ సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేకహోదా గురించి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న రోజుల్లో చంద్రబాబు మాత్రం ఏమీ మాట్లాడలేదంటూ మండిపడ్డారు. ఆరోజుల్లో హోదా కోసం ఎవరైనా ఆందోళన చేస్తే చట్టం తనపని తాను చేసుకు పోతుందని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో చంద్రబాబు చెప్పిన చట్టం ఇపుడు హోదా కోసం పోరాడుతున్న వాళ్ళకి వర్తించదా? అంటూ నిలదీశారు.

ప్రత్యేకహోదాలో ఉన్నదానికన్నా ప్రత్యేక ప్యాకేజిలోనే కేంద్రం ఎక్కువగా ఇస్తోందని చంద్రబాబు పదే పదే చెప్పిన విషయాన్ని వీర్రాజు ప్రస్తావించారు. ప్యాకేజికి మద్దతుగా, ఏపికి కేంద్రం చేస్తున్న సాయానికి మద్దతుగా అప్పట్లో చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను, పేపర్ కటింగులను వీర్రాజు చూపించారు. అప్పట్లో కేంద్రం గురిచిం బ్రహ్మాండమన్న చంద్రబాబు, సుజనా ఇపుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారంటూ మండిపడ్డారు. ఏపికి కేంద్రం చేస్తున్న సాయంపై మంత్రివర్గంతో పాటు అసెంబ్లీలో ధన్యవాద తీర్మనం చేసింది అబద్దమా అంటూ ప్రశ్నించారు.

ఏపికి కేంద్రం చేసిన సాయంపై ప్రతిపక్షాలకు ఆనాడు చంద్రబాబు సవాలు విసిరిన సంగతి పత్రికల్లో వచ్చిన విషయాన్ని కూడా వీర్రాజు ప్రస్తావించారు. పనిలో పనిగా మీడియాను కూడా వీర్రాజు దుమ్ముదులిపేశారు. అప్పట్లో ఒకమాట, ఇపుడొక మాట మాట్లాడుతున్న చంద్రబాబు వైఖరిని మీడియా ఎందుకు ప్రశ్నించటం లేదంటూ నిలదీశారు. (వీర్రాజు ఉద్దేశ్యంలో మీడియా చంద్రబాబు చెప్పినట్లు ఆడుతోందనే) ఏపికి ఎంతో సాయం చేస్తున్న కేంద్రంపైన, తమ పైన మీడియా నెగిటివ్ వార్తలు రాయటం బావోలేదని కూడా అన్నారు.

ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకిజిపై చంద్రబాబు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా మీడియా సమావేశంలో వీర్రాజు ప్రదర్శించారు. ఈ విధమైన వీడియో క్లిప్పుంగులు ఇప్పటి వరకూ వైసిపి మాత్రమే ప్రదర్శిస్తోంది. తాజాగా వైసిపికి తోడుగా బిజెపి కూడా మొదలుపెట్టింది. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తాను అని ఎప్పుడూ చెప్పుకునే చంద్రబాబు 13 జిల్లాల ఏపి అభివృద్ధి గురించి ఎందుకు మరచిపోయారంటూ నిలదీశారు.