ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టత్మకంగా ముఖ్యమంత్రి సీఎం జగన్.. ‘అమ్మ ఒడి’ కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కార్యక్రమంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి అమ్మ ఒడి ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పేర్కొన్నారు. 

సోమవారం  ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. లక్షల కోట్లతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసీపీ నేతలను తరిమితరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కట్టే ఇళ్లన్నీ.. కేంద్రం ఇచ్చిన నిధులేనని సోమువీర్రాజు స్పష్టం చేశారు. ఇంటి పట్టాల భూసేకరణలో రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు టీడీపీ, వైసీపీకి లేదని సోమువీర్రాజు స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. సీఎం జగన్.. అమ్మఒడి పథకం రెండో విడతను ప్రారంభించారు... ఓవైపు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కోడ్ నేపథ్యంలో ఈప‌థ‌కం ప్రారంభం ప్రశ్నార్ధకంగా మారినా.. సీఎం వెన‌క్కి త‌గ్గ‌లేదు.. రెండో విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని నెల్లూరు నుంచి ప్రారంభించారు.. సీఎం వైఎస్ జ‌గ‌న్ చేతుల మీదుగా ఈ కార్య‌క్ర‌మం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల తల్లుల ఖాతాలో రూ.15వేలు జమ కానున్నాయి.