అమరావతి: బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెగ తగిలినట్లే ఉంది. బీసీ సీఎం ఎజెండాపై ఆయన మాట మార్చారు. తాము అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని గురువారంనాడు ప్రకటించిన ఆయన గురువారంనాడు యూటర్న్ తీసుకున్నారు. 

బీసీని సీఎంగా చేస్తామని సోము వీర్రాజు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై జనసేన శ్రేణులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ చీఫ్ పవన్ కల్యాణ్ సీఎం అవుతారని భావిస్తుంటే, దానికి అవకాశం లేకుండా చేస్తూ సోము వీర్రాజు ప్రకటన చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన మాట మార్చారు. 

Also Read: పవన్ కల్యాణ్ కు సోము వీర్రాజు చెక్?: జనసేన శ్రేణుల మండిపాటు

తమది జాతీయ పార్టీ అని, సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం తనకు లేదని ఆయన చెప్పారు. పైగా, తమ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కలిసి సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో ఏకపక్ష ప్రకటన చేసిన సోము వీర్రాజు ఆ తర్వాత వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతూ తాము అధికారంలోకి బీసీ నేతను సీఎంగా చేస్తామని చెప్పారు. ఆ దమ్ము చంద్రబాబుకు గానీ జగన్ కు గానీ ఉందా అని నిలదీశారు. చంద్రబాబును ఒప్పించి తాను హోం మంత్రిని అవుతానని, అప్పుడు తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల అంతు చూస్తానని టీడీపీ ఎపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సోము వీర్రాజా ఆ విధంగా అన్నారు. 

అచ్చెన్నాయుడు హోం మంత్రి అయినా అధికారం చంద్రబాబు చేతిలోనే ఉంటుందనే అర్థం వచ్చే విధంగా సోము వీర్రాజు మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్, చంద్రబాబు భార్య, కోడలి హోం మంత్రివి అవుతావని ఆయన అచ్చెన్నాయుడిని ఉద్దేశించి అన్నారు.