అమరావతి: బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన శ్రేణులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కల్యాణ్ ను ఎప్పటికప్పుడు వెనక్కి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు మరోసారి జనసేన, బిజెపి మధ్య విభేదాలకు కారణమయ్యాయి.

బిజెపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నారు. అదే నమ్మకంతో జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ఉన్నారు. కానీ, సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ సామాజిక వర్గం ప్రస్తుతం అగ్రవర్ణాల జాబితాలో ఉంది. కాపులను బీసీల్లో చేర్చాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. అయితే, అది కార్యరూపం దాల్చడం లేదు. కార్యరూపం దాలుస్తుందనే నమ్మకం కూడా లేదు. 

Also Read: అచెన్న వార్నింగ్: జగన్, చంద్రబాబులపైకి సోము వీర్రాజు అస్త్రం

సోము వీర్రాజు చేసిన ప్రకటన వల్ల పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. దీనిపైనే జనసేన శ్రేణులు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తిరుపతి విషయంలో కూడా సోము వీర్రాజు ఏకపక్ష ప్రకటన చేశారు. తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. దీంతో జనసేన వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి. 

సోము వీర్రాజు వైఖరి పట్ల పవన్ కల్యాణ్ కూడా అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర బిజెపికి, జనసేనకు గ్యాప్ ఉందని ఆయన అన్నారు. బిజెపి కేంద్రంలో ఓ రకంగా, రాష్ట్రంలో మరో రకంగా వ్యవహరిస్తోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతి అభ్యర్థి ఎంపిక ఇరు పార్టీల మధ్య చర్చల్లో ఖరారవుతారని ఆయన చెప్పారు. అయితే, తాజాగా సోము వీర్రాజు చేసిన ప్రకటన జనసేనను ఇరకాటంలో పెట్టినట్లు భావిస్తున్నారు. 

బీసీ సీఎంను కాదనలేని పరిస్థితిని, పవన్ కల్యాణ్ ను వద్దనుకునే పరిస్థితి లేకుండా సోము వీర్రాజు చేశారని జనసేన వర్గాలు మండిపడుతున్నాయి. దళిత నేతను సీఎంను చేస్తానని పొరుగు రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ చెప్పి ఆ తర్వాత మాట తప్పారని, దానికి కేసీఆర్ సమాధానం చెప్పుకోలేని స్థితిలో పడ్డారని ఆ వర్గాలంటున్నాయి. ఇప్పుడు సోము వీర్రాజు ప్రకటన వల్ల తమకు ఇదే పరిస్థితి వచ్చిందని జనసేన వర్గాలు అంటున్నాయి. తొందరపడి సోము వీర్రాజు ఆ ప్రకటన చేయడంలోని ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని చెబుతున్నారు.