తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని అంటారని.. కానీ తామే కావాలని తమ అధిష్టానాన్ని కలుస్తారని మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని అంటారని.. కానీ తామే కావాలని తమ అధిష్టానాన్ని కలుస్తారని మండిపడ్డారు. బుధవారం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రతి విషయంలో కేంద్రాన్ని విమర్శించడం సరికాదని అన్నారు. ప్రధాన మంత్రుల్ని మార్చానని, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు అప్పుడు రైల్వేజోన్, ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు.
ఏపీకి ప్రత్యేక హోదా వద్దని అన్నదే చంద్రబాబు అని విమర్శించారు. ఇప్పుడు సభలు పెడుతున్న చంద్రబాబును అప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారో ప్రశ్నిస్తున్నారా అని అడిగారు. చంద్రబాబు ముందుకు వస్తే ఒకే వేదికపై చర్చకు తాము సిద్ధమని సవాల్ చేశారు. సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు శాంతిభద్రతల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో హోంమంత్రి అమిత్ షాపై దాడి చేస్తే.. చంద్రబాబు వాళ్లపై చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆయన వైఖరి మార్చుకోవాలని అన్నారు.
చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారని.. పొత్తులపై వారే నిర్ణయం తీసుకుంటారన్నారు. తమది మంచి సిద్దాంతాలు ఉన్న జాతీయపార్టీ అని.. పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందన్నారు.
