ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలతో మండిపడ్డారు. గురువారం రాజమండ్రి పర్యటనలో భాగంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. 

పోలవరంతో పాటు పలు విషయాలపై మాట్లాడుతూ అధికార, ప్రతిపక్ష పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరం విషయంలో టీడీపీ, వైసీపీ నేతలు వివాదం సృష్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరని ఆయన వ్యాఖ్యానించారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో డబ్బులు ఇచ్చిన రైతులను మళ్ళీ రికార్డుల్లో నమోదు చేసి డబ్బులు కాజేశారని సోము వీర్రాజు ఆరోపించారు. కలెక్టర్ భాస్కర్ రూ. 48 వేల కోట్లు పెంచేశారని.. ఇప్పుడు మళ్ళీ అదే అధికారిని వైసీపీ ప్రభుత్వం నియమించుకుందన్నారు.

‘విజయవాడలో 10 కోట్లతో గత ప్రభుత్వం గెస్ట్ హౌస్ కట్టింది. ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుంది. జగన్‌ను ప్రశ్నిస్తున్నాను. పోలవరం అవినీతిపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం పూర్తి స్థాయిలో నిధులు ఇస్తుంది. పోలవరం ప్రాజెక్టు కట్టితీరుతాం. టిడ్కో గృహాలు 60 వేలు మాత్రం పూర్తయ్యాయి. 

సీపీఐ నాయకుడు టిడ్కో ఇళ్ళు ఇచ్చేస్తామంటున్నారు. ఇళ్ళు ఇవ్వటానికి సీపీఐ నాయకుడు ఎవరు..?. జగన్ వచ్చిన తర్వాత ఒక్క ఇళ్ళు కూడా కట్టలేదు. జగన్ 30 లక్షలు పట్టాలు ఇస్తానంటున్నారు. ఇళ్ళు పట్టాల్లో అవినీతి జరిగింది. మునిగిపోయే భూములు ఇళ్ళు స్థలాలుగా పంపిణీ చేస్తారా..?. రాజమండ్రి ఆవ భూములు కొనగోలులో 150 కోట్లు అవినీతి జరిగింది’ అని సోమువీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు.

‘ప్రవీణ్ ప్రకాష్ ఏపీ భవన్‌కు స్పెషల్ ఆఫీసర్. 10 కోట్లు ఏపీ భవన్ నిదులు చంద్రబాబు హాయాంలో ఖర్చు చేశారు. టీటీడీ బడ్జెట్ ఏడాదికి 1200 కోట్లు. హిందుత్వం కోసం రూ. 500 కోట్లు ఖర్చు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ ప్రజలు డబ్బులతో చర్చీలు నిర్మిస్తున్నారు. జగన్ ప్రతీ జిల్లాలో రూ. 15 కోట్లతో చర్చిలు నిర్మిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, మంత్రులు ఎవరు నోరు మెదపడం లేదు. పిఠాపురంలో పనికిరాని భూములు కలెక్టర్ కొనుగోలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అవినీతి డబ్బులు ఎక్కడకి వెళుతున్నాయి. పోలవరం, టీటీడీ, ఇళ్ళు, ఇళ్ళు స్థలాల కొనుగోలులో అవినీతి జరిగింది.

ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు తిట్టించవచ్చా..?. నేను చంద్రబాబుని తిట్టకూడదా..?. ఏపీలో నిజమైన ప్రతిపక్షం బీజేపీ. టీడీపీ హయాంలో కోడిగుడ్డులో ఏడాదికి 700  కోట్లు అవినీతి జరిగిందని వీర్రాజు వ్యాఖ్యానించారు.