విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని దానికి చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. పీపీఏ కనుసన్నుల్లో జరగాల్సిన నిర్మాణ పనులను చంద్రబాబు నాయుడు అన్యాయంగా ఓన్ చేసుకుంటున్నారని ఆరోపించారు. 

పోలవరం ప్రాజెక్టులో ఎంతో అవినీతికి జరిగిందన్నారు. ఆ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రాజెక్టు వద్ద ఫోజులు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో గేటు పెట్టేందుకు ఎంతో హంగు ఆర్భాటం చేస్తున్నారని ఇదేదో విచిత్రంలా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు అవినీతిపరుడని, ఆయన రక్తమే అవినీతి రక్తం అంటూ దుమ్మెత్తిపోశారు.

పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు ఏనాడు మాట్లాడలేదని ఆరోపించారు. రాష్ట్ర విభజనలో డబుల్ గేమ్ ఆడిన చంద్రబాబు ఆ తర్వాత పోలవరం విషయంపై నోరెత్త లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపుమండలాలపై చర్చ లేవనెత్తింది బీజేపీయేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎప్పటి నుంచో ఉద్యమం నడుస్తుందని సోము వీర్రాజు గుర్తు చేశారు. 1980లో పోలవరం ప్రాజెక్టుకు ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారని తెలిపారు. 

1995లో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 2004 వరకు అంటే తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు పోలవరంపై మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 

రాజ్య సభలో కానీ, విభజన సమయాల్లో కానీ ఏనాడైనా చంద్రబాబు నాయుడు ఒక్క మాటైనా మాట్లాడారా అంటూ నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో గొంతెత్తి మాట్లాడింది ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని చెప్పుకొచ్చారు. కానీ రాజ్యసభలో ఉన్న ఇద్దరు టీడీపీ ఎంపీలు ముక్కుకు గుడ్డకట్టుకుని సమన్యాయం అన్నారని గుర్తు చేశారు. 

రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యురాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొద్దు అంటూ వాదిస్తే ఆనాడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీలో ఎందుకు ఖండించలేదో చెప్పాలని సోము వీర్రాజు నిలదీశారు. 

ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దమ్మున్న, ధైర్యం ఉన్న నాయకుడు అంటూ కొనియాడారు. పనిని చేతల్లో చూపే వ్యక్తి కాబట్టే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రూ.10వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని తీర్మానించారని తెలిపారు.  

వైఎస్ మరణానంతరం ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ను రద్దు చేసి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి కట్టబెట్టారన్నారు. అంచనాలను రూ.16వేల కోట్లకు పెంచి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి కట్టబెట్టారన్నారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి పోలవరం ప్రాజెక్టుకు కట్టబెట్టడం వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు.

చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరేనని సోము వీర్రాజు గుర్తు చేశారు. అందువల్లే నేడు కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్పించి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

అలాంటి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి పోలవరం పట్టదా అంటూ వ్యాఖ్యానిస్తారా అంటూ నిలదీశారు. చంద్రబాబు నాయుడుకు పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మాణానికి ఏ సందర్భంలో చంద్రబాబు సంసిద్ధంగా లేడని ఆరోపించారు.  

1995 మరియు 2004 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను చేపట్టకుండా  కేవలం రెండు ఎత్తిపోథల పథకాన్ని కట్టించి చేతలు దులుపుకున్నారని తెలిపారు. చంద్రబాబుకు దమ్ములేదు, చేతకానివాడు కాబట్టే రెండు ఎత్తిపోతల పథకాలు కట్టారన్నారు. 

పోలవరంపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు సిద్ధమా అంటూ సోము వీర్రాజు సవాల్ విసిరారు. గతంలోనే పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ నిర్మాణాలు జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని 2013లో కేసీఆర్, తెలంగాణ బీజేపీ నాయకులు చూస్తే తాము ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు తెలిపారు. ఎత్తు తగ్గించాలని, డిజైన్ మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తే అందుకు బీజేపీ ఒప్పుకోలేదన్నారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ ఎంతో కృషి చేశారని ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. నితిన్ గడ్కరీ రెండుసార్లు ప్రాజెక్టు పరిశీలించారని విశాఖపట్నంలో రివ్యూలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. 

ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం రూ.6వేల 700 కోట్లు విడుదల చేస్తే కనీసం రూ.4వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని ఇంకా కేంద్రప్రభుత్వం నిధులు మిగిలే ఉన్నాయన్నారు. మోదీ కడిగిన ముత్యమని ఆయన్ను విమర్శించే హక్కు నైతికత లేదని చంద్రబాబును విమర్శించారు.

చంద్రబాబు నాయుడు అంతులేని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని వాటన్నింటిపై చర్చించేందుకు సిద్ధమన్నారు. నక్కకి నాగలోకానికి ఉన్నతం తేడా మోదీకి చంద్రబాబుకు ఉందన్నారు. మోదీని ప్రశ్నించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.