రాజమండ్రి: అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ నియామకం ఆంధ్రప్రదేశ్ బిజెపిలో చిచ్చు పెట్టింది. పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తూ వచ్చిన సోము వీర్రాజు వర్గం తీవ్ర అసంతృప్తితో తిరుగుబాటు బాట పట్టింది. ఆదివారం సాయంత్రం వరకు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటిస్తూ వచ్చిన సోము వీర్రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

సోము వీర్రాజు వర్గం రాత్రి 8 గంటల ప్రాంతంలో రాజీనామాల పర్వానికి శ్రీకారం చుట్టింది. తమ నేత సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగా రాజీనామాలు చేస్తున్నట్లు ఆయన వర్గానికి చెందిన కొంత మంది రాజీనామాలు చేసి జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు, ఎపి పార్టీ వ్యవహారాల ఇంచార్జీ రాం మాధవ్ కు పంపినట్లు తెలుస్తోంది.

తూర్పు గోదావరి అర్బన్ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, ఆ రెండు కమిటీల్లోని సభ్యులు రాజీనామాలు చేస్తున్నట్లు చెప్పారు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య కూడా రాజీనామా లేఖ రాసినవారిలో ఉన్నారు. 

తనకు పార్టీ రాష్ట్రాధ్యక్ష పదవి వస్తుందని భావించిన సోము వీర్రాజు తనదైన ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు. తీరా కన్నా లక్ష్మినారాయణను రాష్ట్రాధ్యక్షుడిగా నియమించడంతో సోము వీర్రాజు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.