రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబుది కాంగ్రెసు రక్తమని, అందుకే కర్ణాటకలో కాంగ్రెసు అధికారంలోకి రావాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన ఘతన చంద్రబాబుదని ఆయన మండిపడ్డారు. 

కర్ణాటకపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎన్నికల సమయంలో బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారని, బిజెపిని ఓడించడానికి ఉద్యోగ సంఘాల నేతలకు కర్ణాటకకు పంపించారని అన్నారు 

తెలుగువారు అధికంగా ఉన్న పద్మనాభనగర్ వంటి నియోజకవర్గాల్లో బిజెపి గెలిచిందని, పద్మనాభ నగర్ లో 50 వేల ఓట్లు తెలుగువారికి ఉంటే బిజెపి 30 వేలకు పైగా మెజారిటీతో గెలిచిందని ఆయన చెప్పారు. తెలుగువారు ఉన్న 64 సీట్లలో బిజెపి ఓడిపోయిందని చంద్రబాబు అనడాన్ని ఆయన వ్యతిరేకించారు.

మోడీపై వ్యతిరేకతతో మాట్లాడుతున్నారా, పాలన చేస్తున్నారా అని ఆయన చంద్రబాబును అడిగారు. చంద్రబాబు పాలనను గాడిలో పెట్టారా అని అడిగారు. ఎపిలో బిజెపి రాకుండా ఉండాలంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారని ఆయన అన్నారు.