విశాఖపట్నం: తిరిగి తాను తన తల్లిదండ్రులను చూస్తానని అనుకోలేదని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ అన్నారు. ఆయన హైదరాబాదు నుంచి విశాఖపట్నం చేరుకున్నారు. పాకిస్తాన్ జైలు నుంచి విడుదలై మంగళవారం హైదరాబాదు చేరుకున్న ప్రశాంత్ విశాఖపట్నం చేరుకున్నాడు.

స్విట్జర్లాండ్ లో ఉన్న తన ప్రేయసి వద్దకు వెళ్తూ అతను 2017 ఏప్రిల్ లో పాకిస్తాన్ వెళ్లి అక్కడి పోలీసులకు చిక్కాడు. నాలుగేళ్లుగా ఆయన పాకిస్తాన్ జైలులోనే ఉన్నారు. సోమవారంనాడు పాకిస్తాన్ భద్రతా బలగాలు భారత బలగాలకు అప్పగించారు. అక్కడి నుంచి హైదరాబాదు చేరుకున్నాడు. 

Also Read: పాక్ జైలు నుండి తిరిగొచ్చిన టెక్కీ ప్రశాంత్: కుటుంబసభ్యులకు అప్పగించిన సజ్జనార్

నెల రోజుల్లో తాను పాకిస్తాన్ జైలు నుంచి విడుదలవుతానని అనుకున్నానని, అయితే ఇంత కాలం పట్టిందని ఆయన అన్నారు. నాలుగేళ్లు కూడా పాకిస్తాన్ జైలులో ఆధ్యాత్మిక చింతనతో గడిపినట్లు ఆయన తెలిపారు. పాకిస్తాన్ జైలులో భారతీయులు మరింత మంది కూడా ఉన్నారు. వారి విడుదలకు భారత ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన అన్నారు. తెలియక కొంత మంది సరిహద్దులు దాటి పాకిస్తాన్ బలగాలకు చిక్కినట్లు ఆయన తెలిపారు. 

అమ్మ వద్దన్నా తాను వెళ్లానని, పాకిస్తాన్ బలగాలకు పట్టుబడిన తర్వాత దేవుడికి దండం పెట్టుకున్నానని ఆయన చెప్పారు. పాకిస్తాన్ లో తనను బాగానే చూశారని ఆయన చెప్పారు. 

Also Read: అమ్మ మాట వినకుండా వెళ్లి పాక్‌లో చిక్కుకొన్నా: టెక్కీ ప్రశాంత్

శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన ప్రశాంత్ 2017 ఏప్రిల్ లో ఓ రోజు మాదాపూర్ లోని తాను పనిచేస్తున్న కంపెనీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. తన కుమారుడి అదృశ్యంపై ప్రశాంత్ తండ్రి బాబూరావు సైబరాబాద్ పోలీసు కమిషనర్ కు విజ్ఢప్తి చేశారు. చివరకు నాలుగేళ్ల తర్వాత ప్రశాంత్ ఇంటికి చేరుకున్నాడు. 

హైదరాబాదు నుంచి బికనూరు వరకు ప్రశాంత్ రైలులో వెళ్లాడు. ఆ తర్వాత సరిహద్దు దాటాడు. వీసా, పాస్ పోర్టు లేకపోవడంతో ప్రశాంత్ ను పాకిస్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగేళ్లు పాకిస్తాన్ జైలులో ఉండి ప్రశాంత్ తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.