అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంపై ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించారు. అయితే కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలను వాయిదా వేశారు.

అయితే తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో ప్రచారం సాగుతోంది.

ఈ ప్రచారం ఎస్ఈసీ రమేష్ కుమార్ దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన సీరియస్ గా తీసుకొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని తప్పుడు ప్రచారం సాగించడంపై ఆయన మండిపడ్డారు. ఈ తరహా ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విజయవాడ పోలీస్ కమిషనర్, సత్యనారాయణపురం, సైబర్ క్రైమ్ పోలీసులకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఎవరు చేస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.