కొందరికి  తమకాళ్ళ దగ్గరే ఏదో మెత్తగా తగులుతున్నట్లు అనిపించదట.

ఇంద్రకీలాద్రి ఆలయంలో భక్తులు భక్తి పారవశ్యంతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మొక్కులు మొక్కుకునే వారు కొందరు, మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన వారి మరికొందరు. మొత్తానికి అందరూ భక్తిలో ముణిగి ఉన్నారు. ఇంతలో ఎక్కడ నుండో ఒ సన్నని శబ్దం. ఎవరికీ అర్ధం కాలేదు అదేంటో, ఎక్కడి నుండో వస్తోందో. ఇంతలో కొందరికి తమకాళ్ళ దగ్గరే ఏదో మెత్తగా తగులుతున్నట్లు అనిపించదట. తీరా చూస్తే ఇంకేముంది. నోట మాట రాలేదు. కొద్దిసేపు భక్తులు ఊపిరి బిగబట్టారు. అంతే తర్వాత ఒక్కసారిగా ఆలయంలో ఒకటే అరుపులే.

ఇంతకీ అమ్మవారి ఆలయంలో ఏం జరిగింది? అంటే, మధ్యాహ్నం ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు కానీ ఆలయంలోకి పెద్ద తాచుపాము వచ్చేసింది. భక్తల మధ్యలో నుండి బుసలు కొడుతుండటంతో శబ్దం ఎక్కడి నుండి వస్తోందా అని చూశారు. తీరా తమ కాళ్ళ దగ్గరే ఉన్న తాచుపాము బుసలు కొడుతోందని గ్రహించగానే భక్తని పక్కనపెట్టి ప్రాణభయంతో అరుస్తూ పారిపోయారు.

ఒక్కసారిగా ఆలయంలో గందరగోళం మొదలవ్వటంతో ఆలయ అధికారులు కూడా బిత్తరపోయారు. ఏం జరిగిందో అర్ధం కాలేదు. అయితే, కొందరు భక్తులు పాము గురించి చెప్పగానే అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే అటవీశాఖ సిబ్బందికి తెలియజేశారు. కొద్దిసేపటికి అక్కడకు చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది పామును పట్టుకోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.