బిడ్డకు పాలిస్తున్న ఓ తల్లి రొమ్ముపై పాము కాటు వేసింది. దీంతో... ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్ర లోని చంద్రాపూర్ మండలం సోనాపూర్ ప్రాంతానికి చెందిన కొందరు కూలీలు కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని ఊటుకూరుకి వలస వచ్చారు. మిరప కోతలకు వెళుతూ గ్రామంలోని బీసీ కాలనీ పాఠశాల దగ్గర గుడారంలో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆదమరిచి వారు అక్కడే నిద్రపోతున్నారు.

అర్థరాత్రి వేళ శ్రుతి ప్రమోద్ బోయర్(21) అనే మహిళకు మెళకువ వచ్చింది. ఆ సమయంలో ఆమె కుమార్తె ఆకలికి ఏడస్తుండటంతో.. తన రొమ్ముని చిన్నారి నోటికి అందించి ఆమె నిద్రపోయింది. పాప పాలు తాగుతున్న సమయంలోనే అక్కడికి ఓ పాము వచ్చింది. శ్రుతి రొమ్ముపై పాము కాటు వేసింది. దాంతో మెళకువ వచ్చిన మహిళ.. వెంటనే పాముని చేతితో పట్టుకొని విసిరేసింది. ఈ క్రమంలో పాము ఆ పక్కనే నిద్రపోతున్న రూపేష్ ప్రకాష్ అనే యువకుడిని కూడా కాటేసింది.

వారిద్దరినీ వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... శరీరమంతా విషం పాకి శ్రుతి ప్రాణాలు కోల్పోయింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.