ప్రత్యేకహోదా వల్ల కలిగే లబ్ది రూ. 3500 కోట్లేనట. అదే నిజమైతే, దానికోసం పార్లమెంట్ లో అంతలా వెంకయ్య ఎందుకు పోరాటం చేసినట్లు? అంతా నాటకమేనా?
గొప్పలు చేప్పుకోవటంలో కొంతమందికి ఆకాశమే హద్దు. అటువంటి వారిలో కేంద్రంమంత్రి వెంకయ్యానాయడు చాలా ముందుంటారు. గుంటూరులో జరిగిన రాహూల్ సభపై వెంకయ్య మాట్లాడుతూ, ప్రత్యేక ప్యాకేజితో రాష్ట్రానికి రూ. 2.3 లక్షలకోట్ల ప్రాజెక్టులు దక్కాయట. నిసిగ్గుగా ఎంత చక్కగా వెంకయ్య బొంకుతున్నారో.
గడచిన మూడేళ్లుగా రాష్ట్రానికి వచ్చిన విద్యా సంస్ధలు విభజన చట్టంలో చెప్పినవే. వాటికి అదనంగా ఏమీ ఇవ్వలేదు. పైగా విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన ఊసే లేదు. అవిరెండు ఇవ్వటం ప్రధానమంత్రి నరేంద్రమోడికి ఇష్టంలేదు కాబట్టి వాటిగురించి వెంకయ్య కూడా మాట్లాడటం లేదు. ఇచ్చిన హామీలను కూడా లెక్కేసి వెంకయ్య పదే పదే చెప్పేస్తున్నారు.
ఎన్డీఏ వచ్చిన తొలిరోజుల్లో ఇదే వెంకయ్య రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేసినట్లే పౌరసన్మానం కూడా చేయించేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. తర్వాత హోదాపై వెంకయ్య వేసిన పిల్లి మొగ్గలను కూడా ఎలా మరచిపోగలం. మొత్తానికి హోదారాదని సూటిగా చెప్పకుండా ప్రత్యేక ప్యాకేజి అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. దానికి చట్టబద్దత గురించి అడుగుతుంటే మళ్ళీ మాట్లాడటం లేదు.
ప్రత్యేకహోదా వల్ల కలిగే లబ్ది రూ. 3500 కోట్లేనట. అదే నిజమైతే, దానికోసం పార్లమెంట్ లో అంతలా వెంకయ్య ఎందుకు పోరాటం చేసినట్లు? అంతా నాటకమేనా?
రాష్ట్రానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందని వెంకయ్య ఇపుడంటున్నారు. మరే అన్యాయంలో భాజపా కూడా భాగస్వామే కదా? ఇద్దరూ కలిసే కదా రాష్ట్రాన్ని విడగొట్టంది? ఏదో వాళ్ళ అదృష్టం బాగుండి అధికారంలోకి వచ్చారంతే. భాజపా సహకరించకపోతే రాష్ట్ర విభజన జరిగి ఉండేదే కాదు.
ప్రజలు తిరస్కరించిన పార్టీలన్నీ కలిపి గుంటూరులో సభ పెట్టాయట. ఒకపుడు భాజపా పరిస్ధితేంటో వెంకయ్య వెనక్కు చూసుకుంటే బాగుంటుంది.
పెట్టుబడుల గురించి మాట్లాడుతూ, విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సలో వచ్చిన రూ. 10.57 లక్షల కోట్ల ఒప్పందాల్లో రూ. 6.13 లక్షల కోట్లు కేంద్రప్రభుత్వ సంస్ధలవేనట. ఒప్పందాలదేముంది ఎన్నైనా చేసుకోవచ్చు. వాస్తవరూపం దాల్చింది ఎంతన్నదే చూడాలి.
సదస్సు జరిగిన ఐదు మాసాలకు కూడా ఇంకా ఒప్పందాల గురించే మాట్లాడటమేంటి? అభివృద్ధి విషయంలో తమకెవరి సర్టిఫికేట్ అవసరం లేదని కూడా తేల్చేసారు. మరో రెండేళ్ళు వెంకయ్య అలానే మాట్లాడుతారు? తప్పదు భరించాల్సిందే.
