చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తండ్రితో కలిసి పొలానికి వెళ్లిన ఓ బాలికపై ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడి నుండి తండ్రి సురక్షితంగా తప్పించుకోగా పాపం బాలిక మాత్రం తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయింది. 

కుప్పం నియోజకవర్గ పరిధిలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మురుగన్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడి కూతురు సోనియా ఇంటర్మీడియట్  ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా కళాశాలలకు సెలవులు వుండటంతో బాలిక ఇంట్లోనే వుంటోంది. దీంతో తల్లిదండ్రులకు సహాయంగా పొలం పనులకు వెళుతోంది. 

read more  ఆరేళ్ల చిన్నారిని అపహరించి అత్యాచారం

ఈ క్రమంలోనే వేరుశనగ పంటకు కాపలాగా వెళుతున్న తండ్రికి తోడుగా వెళ్లింది బాలిక. అయితే ఆ పొలంవైపు వచ్చిన ఓ ఒంటరి ఏనుగు తండ్రీ కూతుళ్లపై దాడి చేసింది. ఈ దాడి నుండి తండ్రి తప్పించుకోగా కూతురు మాత్రం తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఇలా కన్న కూతురు కళ్లముందే చనిపోతున్నా ఏం చేయలేకపోయాడు ఆ తండ్రి. 

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అడవి జంతువుల వల్ల జరుగుతున్న ప్రమాదాల నుండి తమను కాపాడాలని... లేదంటే ఇలా ప్రతిసారీ తమవారిని కోల్పోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.