గూడూరు సబ్ డివిజన్ ప్రాంతంలోని పోలీస్టేషన్లలో ప్రతీ ఎస్ఐ ప్రతీ నెలా కోటి రూపాయల వరకూ వసూళ్ళు చేయాలట. పైమొత్తంలో కొంత టిడిపి నేతలకు, మరికొంత ఉన్నతాధికారులకు అందివ్వాలట. నెలవారీ చేయాల్సిన వసూళ్ళను తాను చేయలేకపోతున్నట్లు ఎస్ఐ కలెక్టర్ రాసిన లేఖలో పేర్కొన్నారు.
‘నెల నెల మామూళ్ళు వసూళ్ళు చేయటం నావల్ల కాదు’..ఇది ఓ ఎస్ఐ ఆవేధన. ఎస్ఐ రాసిన లేఖ బయటపడటంతో టిడిపి నేతల్లోనే కాకుండా అధికార యంత్రాంగంలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. టిడిపి నేతలు, అధికారులు నెల మామూళ్ళ కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎంతగా రాచి రంపాన పెడుతున్నారో అర్ధమవుతోంది. నెల్లూరుజిల్లా సూళ్ళూరుపేట లో పనిచేస్తున్న ఎస్ఐ జగన్మోహన్ రావు ఏకంగా తన బాధలను కలెక్టర్ కే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసారంటేనే పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతోంది.
లేఖ ఎప్పుడైతే బయటపడిందో వెంటనే ఉన్నతాధికారులు మామూలుగానే సదరు ఎస్ఐని విధుల నుండి తప్పించారనుకోండి అది వేరే సంగతి. ఎస్ఐ చెప్పిన ప్రకారం ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులో ఉన్న గూడూరు డివిజన్ పరిధిలోని పోలీస్టేషన్ చాలా పోలీస్టేషన్ల మాదిరిగానే టిడిపి నేతలకు ఆదాయవనరుగా మారింది. ఎస్ఐ స్ధాయి నుండి పై స్ధాయి వరకూ ప్రతీ నెలా అందరికీ భారీ ఎత్తున మామూళ్ళు పంపాల్సిందే. ఇదే విషయమై తెలంగాణాలో పలువురు ఎస్ఐలు ఒత్తిళ్ళు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న సంగతి అందరూ చూస్తున్నదే.
ఇదే విషయమై జగన్మోహన్ రావు కలెక్టర్ కు లేఖలో పేర్కొన్నారు. గూడూరు సబ్ డివిజన్ ప్రాంతంలోని పోలీస్టేషన్లలో ప్రతీ ఎస్ఐ ప్రతీ నెలా కోటి రూపాయల వరకూ వసూళ్ళు చేయాలట. పైమొత్తంలో కొంత టిడిపి నేతలకు, మరికొంత ఉన్నతాధికారులకు అందివ్వాలట. నెలవారీ చేయాల్సిన వసూళ్ళను తాను చేయలేకపోతున్నట్లు ఎస్ఐ కలెక్టర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇపుడదే విషయం సంచలనంగా మారింది. తనకు వచ్చిన లేఖను కలెక్టర్ జిల్లా ఎస్పీకి అందచేయటంతో ఎస్పీ ఉల్లికిపడి అత్యవసర సమావేశం పెట్టారు. దాంతో విషయం బయటపడింది. వెంటనే ఎస్ఐని అక్కడి నుండి బదిలీ చేసి ఎక్కడా పోస్టింగు ఇవ్వకుండా ఖాళీగా ఉంచారు.
