అనంతపురంలో అమానుషం జరిగింది. తినే అన్నంలో పేడ, మట్టి వేసి కావరాన్ని చూపించాడో పోలీస్. ప్రజలను రక్షించాల్సిన బాధ్యతల్లో ఉన్న ఎస్ఐ అనంతపురం జిల్లాలోని బెలుగుప్ప మండలం గంగవరంలో మంగళవారం ఈ అమానుష ఘటన జరిగింది. 

ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న దళితులు ప్రచారం మధ్యలో భోజనాల కోసం వంట చేస్తున్నారు. ఈ సమయంలో బెలుగుప్ప ఎస్ఐ అన్వర్ భాషా అక్కడికి వచ్చారు. 

అనుమతి లేకుండా ఇక్కడ ఎలా వంట చేస్తున్నారంటూ దళితులపై ఫైర్ అయ్యాడు. ఎవరి పర్మిషన్ తో వంట చేశారంటూ బూతులు తిట్టాడు. అంతటితో అతని కోపం తగ్గలేదు. 

తయారుగా ఉన్న అన్నం, కూరల్లో పేడ, మట్టి, బొగ్గులు వేసి తన క్రూరత్వాన్ని చాటుకున్నాడు. ఎస్ఐ చర్యలను ఊహించని వారు షాక్ కు గురయ్యారు. దాదాపు 200 మందికోసం తయారుచేసిన ఆహారాన్ని ఇలా చేయడం మీద వారు కన్నీటి పర్యంతమయ్యారు.

ఎస్ఐ చర్యలతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే వైసీపీ నేతలు కూడా విందు ఏర్పాటు చేసుకున్నారని, అయితే ఎస్ఐ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని, కావాలనే తమ ఆహారాన్ని పాడు చేశారని ఆరోపించారు. 

ఎస్ఐ ఈ అమానుష వ్యవహారంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సీఐ అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.