విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. దీనిపై శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి స్పందించారు. ఈ ఘటనపై వెంటనే సీఎం జగన్ స్పందించడం అభినందనీయం అని ఆయన ప్రశంసించారు.

అయితే, ముందుగానే చర్యలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. శుక్రవారం నాడు దుర్గమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శివస్వామి.. హిందూ ధర్మంపై దాడులు జరిగితే ప్రజల్లో తిరుగుబాటు ఎదురవుతుందన్నారు.

ఇంత జరుగుతుంటే పోలీసులు కేసులు పెట్టి ఎందుకు అరెస్టులు చేయడం లేదని స్వామిజీ ప్రశ్నించారు. ఇక్కడ గాజులు తొడుక్కొని ఎవ్వరూ లేరంటూ ఘాటూ వ్యాఖ్యలు చేశారు.

ఈ దాడులను నిరసిస్తూ నవంబర్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 30 సంస్థలు కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని శివస్వామి ప్రకటించారు.

హిందూ ధర్మంపై దాడులు జరగకుండా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో మంత్రి కొడాలి నాని తీరుపై శివస్వామి ధ్వజమెత్తారు.

తాము ఓట్లేస్తేనే ఆ మంత్రికి మంత్రి పదవి వచ్చిందని గుర్తుచేశారు. దేవుళ్లపై వ్యాఖ్యల నేపథ్యంలో ఆ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.