పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్లలో పూజారి దారుణ హత్యకు గురయ్యారు. గ్రామంలోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న నాగేశ్వరరావు.. ఆలయ ఆవరణలోనే మృతిచెంది కనిపించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పూజారి దారుణ హత్యకు గురయ్యారు. జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామంలో (Tadimalla village) ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆలయ ఆవరణలో గుర్తుతెలియానని వ్యక్తులు పూజారిని హత్య చేశారు. వివరాలు. తాడిమళ్ల గ్రామంలోని శివాలయంలో (Shivalayam) నాగేశ్వరరావు (50) పూజారిగా పనిచేస్తున్నారు. అయితే సోమవారం రాత్రి నాగేశ్వరరావు ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య ఆందోళన చెందింది. ఈ విషయాన్ని ఇతర కుటుంబ సభ్యులకు తెలిపింది.
ఈ క్రమంలోనే నాగేశ్వరరావు (Nageswara Rao ) కుటుంబ సభ్యులు ఆయన విధులు నిర్వర్తిస్తున్న శివాలయం వద్దకు వచ్చారు. అయితే ఆలయం వద్ద నాగేశ్వరరావు వాహనం కనిపించకపోవడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. నాగేశ్వరరావు పొలం వద్ద గాలించగా కూడా ఆయన ఆచూకీ లభించలేదు.
అయితే మంగళవారం తెల్లవారుజామున (మార్చి 22) ఆలయ ఆవరణలోనే నాగేశ్వరరావు దారుణ హత్యకు గురై కనిపించారు. రక్తపు మడగులో నాగేశ్వరరావు మృతదేహాన్ని గుర్తించినట్టుగా కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇక, నాగేశ్వరరావు గత కొన్నేళ్లుగా ఆలయంలో పనిచేస్తున్నారని స్థానికులు తెలిపారు.
