ఇచ్చామంటున్న వాళ్ళూ చెప్పక, అందుకున్న వాళ్ళూ చెప్పక పోవటంతోనే బ్యాంకుల పాత్రపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.
నోట్ల రద్దు విషయంలో అటు కేంద్రప్రభుత్వం ఇటు రిజర్వ్ బ్యాంకు ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దై ఇప్పటికి నెల రోజులు దాటినా రాష్ట్రానికి ఎంత మొత్తం పంపిందన్న లెక్కలు మాత్రం చెప్పటం లేదు. ఏదో ఊకదంపుడుగా ఏపికి రూ. 16 వేల కోట్ల వచ్చిందన్న ఓ కాకి లెక్క మాత్రం ప్రచారంలో ఉంది.
నిజంగా ఆర్బిఐ 13 జిల్లాల ఏపికి 16 వేల కోట్ల రూపాయలే పంపి ఉంటే ఆ డబ్బంతా ఏమైందనేది ప్రశ్న. నోట్ల రద్దు అయిన తొలి రోజుల నుండి బ్యాంకులు, ఏటిఎంల వద్ద ‘నో క్యాష్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ మెజారిటీ బ్యాంకు శాఖలు, అత్యధిక ఏటిఎంలు పనిచేయటం లేదు.
ఆర్బిఐ చెబుతున్నట్లుగా నిజంగానే రాష్ట్రానికి 16వేల కోట్లు వచ్చి ఉంటే అవి ఎవరికి అందాయన్నదే అసలు ప్రశ్న. మామూలు జనానికి 2 వేల రూపాయలు దొరకటమే గగనంగా మారిపోయింది. ఇంకోవైపేమో కొందరు కుబేరులకు వద్ద మాత్రం కోట్ల కొద్దీ 2 వేల నోట్ల కట్టలు దొరుకుతున్నాయి.
పోనీ వచ్చిన డబ్బులో ఏ బ్యాంకుకు ఎంత నగదు ఇచ్చింది చెప్పమంటే ఆర్బిఐ చెప్పటం లేదు. ఎంత డబ్బు అందుకున్నాయో చెప్పమంటే బ్యాంకులు కూడా మాట్లాడటం లేదు. అంటే ఇచ్చామంటున్న వాళ్ళూ చెప్పక, అందుకున్న వాళ్ళూ చెప్పక పోవటంతోనే బ్యాంకుల పాత్రపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.
బ్యాంకు ఉద్యోగుల సంఘంకు చెందిన ఓ నేత మాట్లాడుతూ, ఆర్బిఐ ఉద్దేశ్యపూర్వకంగానే జాతీయ బ్యాంకులకు చాలా తక్కువ డబ్బు పంపుతున్నట్లు ఆరోపించారు. ప్రైవేటు బ్యాంకులైన యాక్సిస్, హెచ్ డిఎఫ్ సి, ఐసిఐసిఐ తదితర బ్యాంకులకు మాత్రం వందల కోట్లు పంపుతున్నట్లు వాపోయారు.
బ్యాంకుల తీరు చూస్తుంటే వచ్చిన డబ్బులో ఎక్కువ భాగం దొడ్డి దారిలో కుబేరులకు చేరుతోందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
