విశాఖపట్నం: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రధం దగ్దం ఏపీ రాజకీయాల్లో అగ్గిని రాజేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు, ప్రజల ఆందోళనలతో దిగివచ్చిన ప్రభుత్వం ఈ ఘటనపై సిబిఐ విచారణకు అంగీకరించడమే కాకుండా నూతన రధాన్ని నిర్మించేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే నూతన రధం నమూనా తయారవగా దాన్ని ఇవాళ విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలకు చూపించి సలహాలు, సూచనలు తీసుకుంటోంది ప్రభుత్వం. 

ఈ క్రమంలోనే రధ నమూనాలను తీసుకుని విశాఖ శారదా పీఠానికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీరంగనాథరాజు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, దేవాదాయ శాఖ కమీషనర్ అర్జునరావు వెళ్లారు. రధ నమూనాను పరిశీలించిన పీఠాధిపతులు వారికి పలు సూచనలు చేశారు. 

వీడియో

"

గతానికన్నా శ్రేష్టమైన రథం తయారు చేయించాలని మంత్రులకు స్వరూపానందేంద్ర సూచించారు. రధ నిర్మాణానికి ఉత్కృష్టమైన కలప వినియోగించాలన్నారు. బిట్రగుంట, అంతర్వేది దేవస్థానముల్లో రధాలు దహనం అరిష్టానికి సూచన కాబట్టి ప్రాయశ్చిత్త హోమాలు చేపట్టాలని అన్నారు. 

అలాగే అన్యాక్రాంతమైన అంతర్వేది దేవస్థానం భూములను స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ దృష్టి సారించాలని సంబంధిత మంత్రి వెల్లంపల్లికి సూచించారు. హైందవ సాంప్రదాయాలపై అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఆగమ సలహా మండలిని ఏర్పాటుచేయాలని స్వరూపానందేంద్ర సూచించారు.