రాజంపేట: కడప జిల్లా రాజంపేట ప్రశాంత్‌నగర్‌లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ఉప్పరపల్లె వాసి శంకరయ్య పెయింట్ పనులు చేసుకొని జీవించేవాడు.  నెల్లూరు జిల్లా పొదలకూరులో ఒకరిని వివాహం చేసుకొన్నాడు. ఆమె మృతి చెందింది. రెండేళ్ల క్రితం పెనగలూరు మండలం ఎన్ఆర్‌పురం వాసి రామానుజమ్మను వివాహం చేసుకొన్నాడు. అయితే రామానుజమ్మకు అప్పటికే ఒకరితో వివాహమైంది.

కువైట్‌లో ఉండి వచ్చిన ఆమె భర్తను వదిలి శంకరయ్యను రెండో భర్తగా చేసుకొంది. కడప జిల్లా రాజంపేటలో ప్రశాంత్‌నగర్‌లో రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఆదివారం నాడు రామానుజమ్మ  అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 

రామానుజమ్మకు ఐదు మాసాల చిన్నారి ఉంది. ఆ చిన్నారి ఏడుపును విన్న స్థానికులు ఇంట్లోకి వచ్చి చూసేసరికి  రామానుజమ్మ మృతి చెందింది. అయితే రామానుజమ్మ ఉరేసుకొని చనిపోయిందని ఆమె భర్త స్థానికులకు చెప్పారు. ఆటో తీసుకువస్తానని చెప్పిన  రామానుజమ్మ భర్త పారిపోయాడు.