ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఘట్టమనేని ఆదిశేషగిరావు ఫైరయ్యారు.  చంద్రబాబు సర్కార్‌ అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లతో కాలం గడుపుతోందని విరుచుకుపడ్డారు.  ఘట్టమనేని బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కృష్ణా, గోదావరి డెల్టాలు పూర్తిగా ఎండిపోయాయని మండిపడ్డారు. వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రతి పనికి ప్రతిపక్షం అడ్డుపడుతోందంటూ నెపం నెట్టేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

చంద్రబాబు లేఖ ఇవ్వకపోతే రాష్ట్రం విడిపోయేది కాదని ఆదిశేషగిరిరావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీని ఎందుకు ఉపయోగించుకోకూడదని, హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కాదా? అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత మిగులు విద్యుత్‌ ఉన్నా కరెంట్‌ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారని ధ‍్వజమెత్తారు. బీజేపీ, టీడీపీ నేతలు సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. నోట్ల రద్దు, జీఎస్‌టీ తన గొప్పేనని గతంలో చెప్పిన చంద్రబాబు అవి విఫలమైందన్న తర్వాత ఆ నెపాన్ని బీజేపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ నియామకంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీసారు.