ప్రముఖ పాత్రికేయులు, ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం కార్యదర్శి, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు(87) తుదిశ్వాస విడిచారు. ఆదివారం రాత్రి 10గంటల సమయంలో అస్వస్థతకు గురికావడంతో ఆయనను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా.. హాస్పిటల్ లో చికిత్స అందిస్తుండగానే.. ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు.

1933 ఆగస్టు 10న జన్మించిన తుర్లపాటి 14 ఏళ్ల వయస్సులో జర్నలిజంలోకి అడుగు పెట్టారు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంకు సెక్రెటరీగా పని చేశారు. జాతక కథలు, జాతి రత్నాలు, జాతి నిర్మాతలు, మహా నాయకులు, విప్లవ వీరులు, 18మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు, నా కలం..నా గళం లాంటి పుస్తకాలను ఆయన రచించారు. విదేశాల్లో 20,000లకు పైగా సభల్లో ఉపన్యాసాలు చేసిన తుర్లపాట గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు.

ప్రముఖ నాయకులు అంబేద్కర్‌, నెహ్రూ, రాజాజీలను కుటుంబరావు ఇంటర్వ్యూ చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయవాదులు, ప్రముఖ వ్యక్తులు ఇలా దాదాపు 6000 వేల బయోగ్రఫీలను ఆయన రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో దాదాపు 20వేల సమావేశాల్లో వక్తగా ప్రసంగించారు. దీంతో గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించాడు. ప్రముఖ జాతీయ నేతల ప్రసంగాలను తెలుగులో అనువాదం చేశారు.. చాలా బుక్‌లు రాశారు. 1969లో నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కమిటీలో సభ్యునిగా కేంద్రం నియమించింది. నేషనల్‌ ఫిల్మ్‌ అడ్వైజరీ కమిటీలో, సెంట్రల్‌ ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డులో సభ్యుడిగా పని చేశారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఏపీ ఫిల్మ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీగా విధులు నిర్వహించారు.

కుటుంబరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్తు ఛైర్మన్‌గా పనిచేశారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు కుటుంబరావును కళాప్రపుర్ణతో గౌరవించింది. 1989లో ముట్నూరి కృష్ణారావు ఉత్తమ ఎడిటర్‌ అవార్డు, 1990లో తెలుగు యూనివర్సిటీ ఉత్తమ బయోగ్రాఫ్‌గా.. ఉపన్యాస కేసరీ బిరుదును పొందారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు. 1994లో కేశినాథుని నాగేశ్వరరావు ఉత్తమ జర్నలిస్టు అవార్డు దక్కింది. 1993లో గిన్నిస్‌ బుక్‌ అవార్డు, 1998లో అమెరికా నుంచి వరల్డ్‌ లైఫ్‌ టైం అచీవ్‌ మెంట్‌ అవార్డు పొందారు.