రాయలసీమలో పాదయాత్ర విజయవంతం అవ్వటంతో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలో ఆత్మ విశ్వాసం బాగా హై లెవల్లో ఉన్నట్లుంది. తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న జగన్ కు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. మరో పది రోజులు ఈ జిల్లాలోనే జగన్ పాదయాత్ర ఉంటుంది. మంచి జోష్ లో ఉన్న జగన్ బుధవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తమ ముందు ఏ సేన కూడా నిలబడలేందన్నారు.

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను జనసేన చీలుస్తుందా అన్న ప్రశ్నకు జగన్ పై విధంగా స్పందించారు. ‘జనసేనే కాదు ఏ సేన కూడా తమ ముందు నిలవలేంద’న్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలక వస్తుందని అనుకోవటం లేదని గట్టిగా చెప్పారు.

జనాలందరూ మూడున్నరేళ్ళ చంద్రబాబునాయుడు పాలనపై బాగా విసిగిపోయున్నట్లు చెప్పారు. జనసేన-చంద్రబాబు ఒకటే అన్న విషయాన్ని జనాలు గ్రహించినట్లు తెలిపారు. మూడున్నరేళ్ళ క్రితం రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణాన్ని జనాలు వచ్చే ఎన్నికల్లో వదిలించేస్తారంటూ చెప్పారు.