తాజాగా కురుస్తున్న వర్షాలకు సచివాలయంలోని ఇద్దరు మంత్రుల ఛాంబర్లోకి నీళ్లు లీకవుతున్నాయి. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు ఛాంబర్లతో పాటు ఇరిగేష్ ముఖ్య కార్యదర్శి ఛాంబర్లో కూడా వర్షం లీకవుతోంది. లీకుల దెబ్బకు ఫాల్స్ సీలింగ్ పెచ్చులూడి క్రిందకు పడిపోతోంది. ఎప్పుడేం పడుతుందో అన్న భయంతో మంత్రులు, ముఖ్య కార్యదర్శి తమ ఛాంబర్లను వాడటం మానేసారు.
వెలగపూడిలో నిర్మించిన పేరుగొప్ప తాత్కాలిక సచివాలయం వర్షం పడితే నీళ్ళు కారిపోతోంది. ఆమధ్య కురిసిన వర్షానికి అసెంబ్లీలోని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లోకి నీళ్లు వచ్చేసిన సంగతి అందరూ చూసిందే. సరే, అప్పట్లో ఏదో కుట్ర జరిగిందని అదని ఇదని ప్రభుత్వం సమర్ధించుకున్నది. ఒక్క ప్రతిపక్ష నేత ఛాంబర్లోకి మాత్రమే నీళ్లు ఎలా లీకైందని ప్రభుత్వం ఎదురుదాడి చేయటం అందరూ చూసిందే. జరిగిన కుట్రమీద సిఐడి విచారణ కూడా వేసింది. ఆ విచారణ ఎంత వరకూ వచ్చిందో ఎవరికీ తెలీదు.
ఇంతలో తాజాగా కురుస్తున్న వర్షాలకు సచివాలయంలోని ఇద్దరు మంత్రుల ఛాంబర్లోకి నీళ్లు లీకవుతున్నాయి. మరి, ఇదెవరి కుట్ర అంటుందో చూడాలి. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు ఛాంబర్లతో పాటు ఇరిగేష్ ముఖ్య కార్యదర్శి ఛాంబర్లో కూడా వర్షం లీకవుతోంది.
లీకుల దెబ్బకు ఫాల్స్ సీలింగ్ పెచ్చులూడి క్రిందకు పడిపోతోంది. ఎప్పుడేం పడుతుందో అన్న భయంతో మంత్రులు, ముఖ్య కార్యదర్శి తమ ఛాంబర్లను వాడటం మానేసారు. దాంతో సచివాలయ సిబ్బందే క్రింద పడుతున్న పెచ్చులను ఏరి బయట పాడేస్తున్నారు. అంతేకాకుండా లీకవుతున్న నీటిని ఎలా అదుపులో పెట్టాలో కూడా సిబ్బందికి అర్ధం కావటం లేదు.
వందల కోట్ల రూపాయలు వ్యయం చేసి అత్యవసర పేరుతో నామినేషన్ పైన నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు మొదటినుండీ వివాదాస్పదమే. చేయాల్సిన ఖర్చుకన్నా సుమారు రూ. 600 కోట్లు అధికంగా ప్రభుత్వం ఖర్చు పెట్టిందని ఆరోపణలు వినబడుతూనే ఉన్నాయి. చిన్న వర్షానికే భవనంలోని ఇన్ని చోట్ల నీళ్ళు లీకవుతుంటే రేపటి రోజున రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే ఇక తాత్కాలిక భవనాల గురించి అనుకోవాల్సిన అవసరమే లేదు.
