Tirupati: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఓ మందుబాబు రాజగోపురం ఎక్కి హంగామా సృష్టించాడు. భద్రతా లోపంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏడుకొండల స్వామి సన్నిధిలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. తిరుమల, తిరుపతిలోని స్వామి ఆలయాల్లోకి ఫోన్లు తీసుకెళ్లడం ఇప్పటివరకూ చూసే ఉంటాం. కానీ ఓ మందుబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తాగిన మైకంలో ఏకంగా గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం ఎక్కి కలశాలను పెకిలించేందుకు ప్రయత్నించాడు. పోలీసులు కిందకు దిగమని ఎంతచెప్పినా వినకుండా బెదిరించాడు. ఇంక అతికష్టం మీద అతన్ని కిందకు దింపారు. 

గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారి ఏకాంతసేవ తర్వాత ఆలయం మూసివేశారు. ఆ టైంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఓ వ్యక్తి ఆలయంలో చొరబడ్డాడు. తిన్నగా మహాద్వారం లోపలకు వెళ్లి గోపురం ఎక్కేశాడు.అక్కడ నిల్చుని మందు సీసా ఇస్తేనే కిందిని దిగుతానంటూ రచ్చరచ్చ చేశాడు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినకుండా అక్కడే ఉన్నాడు. ఇక పోలీసులే రంగంలోకి దిగి గోపురానికి నిచ్చెనలు వేసి తాళ్లతో బంధించి కిందకు దింపారు. దాదాపు 3 గంటల పాటు శ్రమించారు. ఈ తతంగమంతా వీడియో తీస్తున్న మీడియా సిబ్బందిపైనా దురుసుగా ప్రవర్తించాడు.

తిరుపతిలో హల్ చల్ చేసిన వ్యక్తిని నిజామాబాద్ జిల్లా కూర్మవాడకు చెందిన తిరుపతిగా గుర్తించారు. అతన్ని తిరుపతి పీఎస్ కు తరలించారు. ఈ ఘటనలో గోపురం కలశాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

భగ్గుమన్న వైసీపీ..

అయితే ఈవివాదంపై ప్రతిపక్ష వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఓ వ్యక్తి రాజగోపురం ఎక్కి మందు కావాలని డిమాండ్ చేసేదాకా వచ్చాడంటే...భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి టీటీడీ ప్రతిష్ఠను మంట గలుపుతోందని మండిపడ్డారు. ఎంతసేపూ గప్పాలు కొట్టుకోవడం తప్ప.....పాలనపై శ్రద్ధ లేదని దుమ్మెత్తిపోశారు. కూటమి నాయకత్వంలో ఆలయాల ప్రతిష్ఠ పెంచుతామన్న నాయకులు....ఇదేనా పరిరక్షించడమని భూమన నిలదీశారు.

YouTube video player

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వీఐపీ సేవల్లో తరిస్తూ ఆలయ భద్రతను గాలికొదిలేశారని మండిపడ్డారు. సిఫార్సు లేఖలకే ప్రాధాన్యం ఇస్తూ భక్తుల గోడును పట్టించుకోవడం లేదని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడి ఆవరణలోని తాగి వెళ్లడమే మహాపాపమైతే....గోపురం ఎక్కడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిశారని వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు.