రాజమండ్రి: ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కారెం శివాజీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య భేటీపై ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. వారిద్దరు ఇటీవల విశాఖపట్నంలో వట్టి రవి ఇంట్లో కలిశారని ఆయన అన్నారు. 

విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర జరిగిన సమయంలో జగన్మోహనరెడ్డి పవన్‌ను కలిసి 40 సీట్లు ఆఫర్‌ చేశారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. అయితే ముఖ్యమంత్రి సీటుపై పవన్‌కల్యాణ్‌ దృష్టి పెట్టడం వల్ల సీట్లు సర్దుబాటుకాక బయటకు వచ్చినట్టు తెలిసిందని అన్నారు. 

కులం, మతం పునాదులపై వారు అధికారంలోకి రాలేరని శివాజీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టుగా ఆడుతూ ఆంధ్ర ప్రజలను మోసగించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం ఏపీని నమ్మించి దగా చేసిందని అన్నారు.

అధికారంలోకి వస్తే విభజన హామీలను నెరవేర్చి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు కాంగ్రెసుతో కలిసి ఒక బలమైన కూటమి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారని, దాన్ని చూసి ఓర్వలేక కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.