మొదటి డోస్ వేసుకున్న 28రోజుల తర్వాతే రెండో డోస్ వేసుకోవాలని... ఈనెల 13 నుండి రెండో డోస్ టీకా పంపిణీ మొదలవుతుందని వైద్యారోగ్య శాఖ కమీషనర్ తెలిపారు.
అమరావతి: హెల్త్ కేర్ వర్కర్లు , ఐసిడిఎస్ సిబ్బంది కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ ఎక్కడ వేసుకున్నారో రెండో డోస్ కూడా అక్కడే వేసుకోవాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. మొదటి డోస్ వేసుకున్న 28రోజుల తర్వాతే రెండో డోస్ వేసుకోవాలని... ఈనెల 13 నుండి రెండో డోస్ టీకా పంపిణీ మొదలవుతుందని వైద్యారోగ్య శాఖ కమీషనర్ తెలిపారు.
ఈనెల 25లోగా హెల్త్ కేర్ వర్కర్లు , ఐసిడిఎస్ సిబ్బంది మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని... ఆ తర్వాత వీరికి మొదటి డోస్ వెయ్యరని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా వీరు ఈనెల 25లోగా వ్యాక్సిన్ వేసుకోవచ్చన్నారు. ఇతర శాఖల సిబ్బంది మార్చ్ 5లోగా మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని...అటు తర్వాత వీరికి వ్యాక్సినేషన్ ఉండదని కమీషనర్ స్పష్టం చేశారు.
read more కరోనా వ్యాక్సిన్ వికటించి వాలంటీర్ మృతి.. ఆర్థిక సహాయం చేసిన జగన్
ఇప్పటికే రెండో విడత కరోనా టీకాల పంపిణీకి ఏపీ సర్కార్ సిద్దమైంది. ఇప్పటికే మొదటివిడతలో వైద్యారోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయగా రెండో విడతలో పంచాయతీ రాజ్, పురపాలక, రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. ఈ విడతలో వ్యాక్సిన్ కోసం 5 లక్షల 90 వేల మంది నమోదు చేసుకోవడంతో వారందరికీ ఇచ్చేలా 3 వేల 181 సెషన్ సైట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది.
మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 88 వేల 307 మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా...ఇప్పటి వరకు లక్షా 8 వేల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. మరో 2 లక్షల మందికి టీకా ఇవ్వాల్సి ఉంది.
తొలి విడత వ్యాక్సినేషన్ అనంతరం అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న వైద్యారోగ్య శాఖ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవనే విషయాన్ని వివిధ శాఖల్లోని ఉద్యోగులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. మొదటి విడతలో కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా 79 దుష్ప్రభావ ఘటనలు చోటుచేసుకోగా రెండో విడతలో అలాంటివి చోటుచేసుకోకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది.
