స్కూల్ నే మసాజ్ సెంటర్ గా మార్చేశారట..విద్యార్థినులతో ఇదేం పని టీచరమ్మ..! (వీడియో)
తమ పిల్లలతో టీచర్ ఇష్టమొచ్చిన పనులు చేయిస్తోందని ఆరోపిస్తూ ఓ తల్లి ఏకంగా జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగుచూసింది.

ఇబ్రహీంపట్నం : విద్యార్థులకు బుద్ది చెప్పాల్సిన ఉపాధ్యాయులే బుద్ది తప్పారట. కలం పట్టాల్సిన చేతులతో కాళ్లుచేతులు నొక్కించుకుంటూ స్కూల్ నే మసాజ్ సెంటర్ గా మార్చారట. తమ పిల్లల బాధ చూడలేక ఓ తల్లి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో టీచరమ్మ వ్యవహారం బయటపడింది. ఈ ఘటన ఉమ్మడి కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల పిటి టీచర్ నాగమణి విద్యార్థినులతో చాకిరీ చేయిస్తున్నారని గ్రామానికి చెందిన తులసి అనే మహిళ ఆరోపిస్తున్నారు. ఈ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న తన కూతురితో కూడా ఇష్టమొచ్చిన పనులు చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. చివరకు సదరు టీచర్ విద్యార్థినులతో మసాజ్ చేయించుకుంటోందని... ఇదేంటని ప్రశ్నిస్తే ఇష్టమొచ్చిన చోట చెప్పుకోవాలని నిర్లక్ష్యంగా జవాబు చెబుతోందని తులసి అన్నారు. దీంతో ఆ పిటి టీచర్ పై జగనన్న చెబుతా కార్యాక్రమంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తులసి వెల్లడించింది.
వీడియో
కలెక్టర్ ఆదేశాలతో గుంటుపల్లి పిటి టీచర్ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఇబ్రహీంపట్నం ఎంఈవో శ్యాంబాబు, నందిగామ డివై ఈవో వెంకటప్పయ్య వచ్చారని... వీరు కూడా ఆ టీచర్ కే అనుకూలంగా వ్యవహరించారని బాధిత తల్లి తులసి ఆరోపించారు. స్కూల్ హెడ్ మాస్టర్ కూడా సదరు పిటి టీచర్ పై ఎవరూ ఫిర్యాదు చేయవద్దని విద్యార్థులను బెదిరిస్తున్నారని అన్నారు. దీంతో విచారణకు వచ్చిన ఉన్నతాధికారులు అసలేమీ జరగలేదని తేల్చారని అన్నారు. ఇష్టముంటే తన కూతుర్ని స్కూల్ కు పంపాలని... లేదంటే ప్రైవేట్ స్కూల్లో చేర్చాలని ఉచిత సలహా ఇచ్చారని తులసి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Read More రేపల్లెలో కిరాతకం... స్మశాన వాటికలో డిగ్రీ విద్యార్థి దారుణ హత్య
కలెక్టర్ ఆదేశించినా తనకు న్యాయం జరగలేదని... పిటి టీచర్ తీరులో ఎలాంటి మార్పు లేదని బాధిత తల్లి తులసి వాపోయారు. అందువల్లే మరోసారి విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో మరోసారి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వెంటనే పిటి టీచర్ నాగమణిపై చర్యలు తీసుకుని తమలాగే బాధపడతున్న పిల్లలు, తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టన్ ను కోరినట్లు తులసి తెలిపారు.