రేపల్లెలో కిరాతకం... స్మశాన వాటికలో డిగ్రీ విద్యార్థి దారుణ హత్య
డిగ్రీ విద్యార్థి ఓ రౌడీషీటర్ తో గొడవ పెట్టుకుని దారుణ హత్యకు గురయిన విషాద ఘటన రేపల్లెలో చోటుచేసుకుంది.
బాపట్ల : రేపల్లె మండలం అరవపల్లిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని స్మశాన వాటికలో ఓ యువకుడు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. యువకుడి మృతదేహం రక్తపుమడుగులో పడివుండటాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
వివరాల్లోకి వెళితే... రేపల్లెలోని 24వార్డులో నివాసముండే మేక సాయి(24) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇతడికి జగనన్న కాలనీలో నివాసముంటున్న బ్లేడ్ హర్షతో గొడవలున్నాయి. పలుమార్లు వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో సాయిపై కక్ష పెంచుకున్న హర్ష మద్యంమత్తులో దారుణానికి పాల్పడ్డాడు.
రేపల్లె సమీపంలోని అరవపల్లి శివారులోని స్మశాన వాటిక వద్ద సాయి, హర్ష గొడవపడ్డారు. అయితే సాయిని హత్యకు ముందే ప్లాన్ చేసిన హర్ష కత్తి వెంటతెచ్చుకున్నాడు.దీంతో విచక్షణారహితంగా పొడవడంతో సాయికి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతడు చనిపోయాడని నిర్దారించుకుని హర్ష అక్కడినుండి వెళిపోయాడు.
Read More సహజీవనం చేసిన యువకుడిపై మహిళ యాసిడ్ దాడి.. గుంటూరులో ఘటన.. ఏం జరిగిందంటే ?
క్రైస్తవ స్మశానంలో యువకుడి మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు మృతుడిని సాయిగా గుర్తించారు. హత్యకు పాల్పడింది బ్లేడ్ హర్షగా గుర్తించారు. నేరచరిత్ర కలిగిన హర్ష విజయవాడలో నగర బహిష్కరణకు గురయినట్లు అనుమానిస్తున్నారు. పరారీలో వున్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.