తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పాఠశాల బస్సుకి అగ్ని ప్రమాదం జరిగింది. కాగా..  చిన్నారులు పెనుప్రమాదం నుంచి బయటపడ్డారు. రామచంద్రపురం మండలం ద్రాక్షరామ అన్నయ్యపేటలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు చిన్నారులను తీసుకుని వస్తుండగా బీమాక్రోసూపాలేం గ్రామంలో రోడ్డు ప్రక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌‌ను ఢీకొట్టింది. 

వెంటనే షాక్‌తో బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది చిన్నారులతో పాటు రాజేశ్వరి అనే టీచర్ ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన టీచర్ ఎంతో సమయస్ఫూర్తితో చిన్నారులను బస్సులో నుంచి హుటాహుటిన కిందికి దించి వారి ప్రాణాలను కాపాడింది. అనంతరం బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం నుంచి చిన్నారులంతా సురక్షితంగా బయటపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.