గవర్నర్ వద్ద చేయాల్సిన బలనిరూపణను రాష్ట్రపతి సమక్షంలో చేయాలని నిర్ణయించటమే కీలకం. అంటే ఓ రకంగా గవర్నర్ పై తిరుగుబాటు చేయటంగానే భావించాలి.
గవర్నర్ రాజకీయానికి విరుగుడుగా శశికళ వర్గం ఏకంగా రాష్ట్రపతి ముందే పెరేడ్ చేయాలని నిర్ణయించింది. మామూలుగా అయితే, ఎక్కువమంది ఎంఎల్ఏల బలమున్న వారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించటమే గవర్నర్ పని. మొన్నటి ఆదివారమే ఏఐఏడిఎంకె ఎంఎల్ఏలు ఏకగీవ్రంగా శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. విచిత్రమేమిటంటే ఆ పదవికి చిన్నమ్మను ప్రతిపాదించిందే పన్నీర్ సెల్వం. తర్వాత జరిగిన పరిణామాలతో పన్నీర్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసారు.
ఇక్కడే, కేంద్రం తన రాజకీయానికి పదనుపెట్టింది. పన్నీర్ రాజీనామా చేసే సమయానికి బెంగుళూరులో ఉన్న గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావు వెంటనే తమిళనాడుకు రావాలి. తదుపరి సిఎంగా శశికళ చేత ప్రమాణ స్వీకారం చేయించాలి. కానీ చెన్నైకి చేరుకోవాల్సిన గవర్నర్ అనూహ్యంగా ముంబయ్ వెళ్లిపోయారు. దాంతో శశికళ ఆశలకు బ్రేక్ పడింది. దాంతో గవర్నర్ ను తెరవెనుక నుండి నడిపిస్తోంది కేంద్రమేనన్న అనుమానాలు మొదలయ్యాయి.
అదే సమయంలో తన రాజీనామాను సమర్పించిన తర్వాత పన్నీర్ కొన్ని గంటలపాటు ఎవరికీ అందుబాటులో లేరు. ఆ సమయంలో ఏమి జరిగిందో తెలీదు కానీ మంగళవారం రాత్రి హటాత్తుగా మెరీనాబీచ్ లోని జయలలిత సమాధి వద్ద ప్రత్యక్షమయ్యారు. అప్పటి నుండి శశికళపై ధ్వజమెత్తటం మొదలుపెట్టారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్ధితులను మీడియాకు వివరించారు. ఎప్పుడైతే పన్నీర్ నోరువిప్పారో అప్పటి నుండి తమిళనాడులో రాజకీయంగా ప్రకంపనలు మొదలయ్యాయి.
బుధవారం ఉదయానికైనా గవర్నర్ చెన్నైకి వస్తారని అనుకుంటే ఇప్పటికీ అడ్రస్ లేరు. తమిళనాడులో రాజకీయంగా ఇంత గందరగోళం జరుగుతున్నా గవర్నర్ ముంబాయ్ లో తీరుబడిగా కూర్చోవటం గమనార్హం. శశికళతో సహా ఎవరికీ ఫోన్లో సైతం గవర్నర్ అందుబాటులో లేకపోవటం పలు అనుమానాలకు దారితీస్తోంది. గవర్నర్ వైఖరితో విసిగిపోయిన శశికళ చివరకు తనకు మద్దతిస్తున్న ఎంఎల్ఏలతో ఢిల్లీకి వెళ్ళాలని నిర్ణయించింది. గవర్నర్ వద్ద చేయాల్సిన బలనిరూపణను రాష్ట్రపతి సమక్షంలో చేయాలని నిర్ణయించటమే కీలకం. అంటే ఓ రకంగా గవర్నర్ పై తిరుగుబాటు చేయటంగానే భావించాలి.
పనిలో పనిగా క్యాంపు రాజకీయాలూ మొదలయ్యాయి. ఎంఎల్ఏల మద్దతు తనకు ఉందంటున్న శశికళ తన మద్దతుదారులను గుర్తుతెలీని చోటికి ఎందుకు తరలించారో అర్ధం కావటం లేదు. ఇంకోవైపు బలనిరూపణకు తానూ సిద్ధమంటూ పన్నీర్ సెల్వం సవాలు విసిరటం గమనార్హం. డిఎంకె పన్నీర్ కే మద్దతు ప్రకటించింది. మొత్తం మీద తమిళనాడులో రాజకీయంగా ఇంత గందరగోళం నెలకొనటం దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి.
