Asianet News TeluguAsianet News Telugu

ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించిన సర్పంచ్.. నిధులు కేటాయించకపోవడంపై విచిత్ర నిరసన..

గుంటూరులో ఓ సర్పంచ్ విచిత్రమైన నిరసన చేపట్టాడు. మున్సిపాలిటీ చెత్త వాహనంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాడు. పంచాయితీలకు నిధులు విడుదల చేయకపోవడంపై నిరసనగానే ఇలా చేశారు.

Sarpanch went door to door to collect garbage over protest on government in guntur
Author
First Published Sep 8, 2022, 11:04 AM IST

గుంటూరు : గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కాట్రపాడు గ్రామ సర్పంచ్ మేదరమెట్ల శంకర్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు బుధవారం పారిశుద్ధ్య కార్మికులుగా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేశారు. నిరసన కార్యక్రమంలో భాగంగానే ఇలా చెత్త సేకరించారు. ప్రభుత్వం అందించిన మూడు చక్రాల చెత్త సేకరణ బండి నడిపిస్తూ, విజిల్ ఊదుతూ గ్రామంలో తిరిగారు. సర్పంచి చెత్త సేకరిస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు ఆయనను అనుసరించారు. 

పంచాయితీకి ఏవిధమైన సొంత ఆర్థిక వనరులు లేవని, గ్రామానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.6 లక్షల 14,15 ఆర్థిక సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మార్గంలో తీసుకుందని సర్పంచ్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు కూడా అందకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు పనులకు రావడంలేదని, దీంతో ఇళ్ల వద్ద చెత్త పేరుకుపోయిందని ఆరోపించారు. విద్యుద్దీపాల కొనుగోలుకు డబ్బులు లేక పాతవాటిని మరమ్మతులు చేసి, స్తంభాలకు బిగిస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్ చేయవలసిన పనులు వాలంటీర్లు చేస్తున్నారని అన్నారు. తన నిరసనను ప్రభుత్వం గుర్తించి నిధులు తిరిగి ఇవ్వాలని కోరుతునట్లు తెలిపారు.

బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. ఏపీలోని 6 జిల్లాలకు భారీ వర్ష సూచన..

కాగా, ప్రభుత్వ విధానాలకు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇలాంటి నిరసనలు కొత్తేం కాదు. ఆగస్ట్ లో కేరళలో ఓ వ్యక్తి నడిరోడ్డుమీద పడ్డ గుంతలోనే స్నానం చేయడం, బట్టలు ఉతుక్కోవడం.. యోగా చేయడం లాంటి పనులతో నిరసన వ్యక్తం చేశాడు. ఎడతెరిపి లేని వర్షాలకు కేరళలోని రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూడు గుంతలతో నరకప్రాయంగా మారింది. దీనికి నిరసనగానే ఈ వ్యక్తి వినూత్నకార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఈ మొత్తం నిరసనను వీడియోలు, ఫొటోలు తీసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశాడు.

ఈ వీడియో క్లిప్‌లో, బకెట్, మగ్, సబ్బు, టవల్‌తో బయలుదేరిన వ్యక్తి, వర్షపు నీటితో నిండిన గుంటలో స్నానం చేస్తున్నాడు. అతను రోడ్డుపై ఉన్న బురద నీటి గుంటలోనే తన బట్టలు ఉతుకుతున్నాడు. దీన్నంతా రోడ్డు మీద వెడుతున్న వాహనదారులు ఆసక్తిగా గమనించడం కనిపిస్తుంది. కొంతమంది ఆగి, కారుల్లోంచి దిగి ఏమైందో కనుక్కుంటున్నారు. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. నిరసనకు దిగిన వ్యక్తిని హంజా పోరాలిగా గుర్తించారు.

వీడియోలో, స్థానిక ఎమ్మెల్యే యుఎ లతీఫ్ కూడా ప్రత్యేక నిరసనను నిర్వహిస్తున్న ప్రదేశానికి చేరుకోవడం కనిపిస్తుంది. ఎమ్మెల్యే కారు దగ్గరకు వస్తుండగా, ఆ వ్యక్తి గుంతలో ధ్యాన భంగిమలో కూర్చొని కనిపించాడు. ఎమ్మెల్యే ముందు ఓ పెద్ద గుంత మధ్యలో నిలబడి యోగాసనాలు వేయడం కూడా రికార్డు అయింది. కేరళలో గుంతల కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజుల తర్వాత ఈ వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ఎర్నాకులం జిల్లాలోని నెడుంబస్సేరి వద్ద జాతీయ రహదారిపై గుంత కారణంగా స్కూటర్ పై వెడుతున్న 52 ఏళ్ల  వ్యక్తి ఎగిరిపడి ట్రక్కును ఢీకొట్టాడు. అక్కడికక్కడే మృతి చెందాడు.

Follow Us:
Download App:
  • android
  • ios