కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా మందుబాబుల పరిస్ధితి దారుణంగా తయారైంది. చుక్కపడినిదే పూట గడవని వారు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి, కుటుంబసభ్యులను నానా ఇబ్బందులకు గురిచేశారు.

వీరి బాధను అర్ధం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం... మద్యం షాపులు ఓపెన్ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతినిచ్చింది. అయితే లిక్కర్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మందుబాబులకు తడిసిమోపెడవుతుంది.

Also Read:మీ శానిటైజర్ లో మిథనాల్ ఉందా?.. అయితే జాగ్రత్త...

అంత డబ్బు పెట్టలేని వారంతా తక్కువ ధరకు లభించే హ్యాండ్ శానిటైజర్‌ను సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఇదే రకమైన ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు సింధు జంక్షన్ సమీపంలో ఉన్న బీసీ కాలనీకి చెందిన నటరాజ్ అనే వ్యక్తి వ్యక్తి పాత సామాన్ల దుకాణం నడుపుతున్నాడు.

తమిళనాడు, తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్లాస్టిక్, చిత్తు కాగితాలు సేకరించి నటరాజ్ దుకాణంలో విక్రయిస్తే ఉండేవారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా పుదిపేటకు చెందిన మల్లిక, లత కూడా ఈ దుకాణం వద్దే జీవనం సాగిస్తున్నారు.

Also Read:విపరీతంగా దాహార్తి: మంచినీళ్లు అనుకుని శానిటైజర్ తాగిన అటెండర్ మృతి

తిరుపతి పేపర్స్ కాలనీనికి చెందిన సెల్వం కూడా వీరితో పాటే ఉండేవాడు. ఇటీవల కాలంలో లిక్కర్ ధరలు విపరీతంగా పెరగడం, శానిటైజర్ సీసాలు విరివిగా లభిస్తుండటంతో వీరు మత్తు కోసం శానిటైజర్ తాగడం అలవాటు చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో రోజూలాగే శనివారం శానిటైజర్ తాగిన వెంటనే ఈ ముగ్గురి పరిస్ధితి విషమించింది. రాత్రి లత, మల్లిక.. నటరాజ్ దుకాణం వద్దే ప్రాణాలు కోల్పోయారు. సెల్వం ఆదివారం రాత్రి మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను రుయా మార్చురీకి తరలించారు.