మా నాన్న చితి ఆరక ముందే...: బాబాయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ సంచయిత కంటతడి
తాను సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ కావడంపై తన బాబాయ్, టీడీపీ నేత అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలకు సంచయిత గజపతి కౌంటర్ ఇచ్చారు. బాబాయ్ మాటలు తనను బాధించాయని అన్నారు.
విశాఖపట్నం: సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ పదవి వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. టీడీపీ నేత, మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తనపై చేసిన వ్యాఖ్యలకు మాన్సాస్ ప్రస్తుత చైర్ పర్సన్ సంచయిత కౌంటర్ ఇచ్చారు. ఈ సమయంలో ఆమె కంటతడి పెట్టారు. 2016లో తమ తండ్రి మరణించారని, ఆయన చితి కూడా ఆరక ముందే అశోక్ గజపతి రాజు బోర్డు చైర్మన్ అయ్యారని అంటూ దాన్నేమనాలి, చీకటి జీవోలనే అనాలా అని ఆమె ప్రశ్నించారు. ట్రస్టుకు తమ పెదనాన్న, తన నాన్న చైర్మన్లుగా వ్యవహరించారని ఆయన చెప్పారు.
తాను క్రిస్టియన్ నని బాబాయ్ మాట్లాడితే బాధేస్తుందనే ఆమె అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అన్నారు. తాను హిందువునే అని ఆమె స్పష్టం చేశారు. వాటికన్ సిటీకి వెళ్లి ఫొటోలు దిగితే క్రిస్టియన్ ను అవుతానా అని ఆమె అడిగారు. అశోక్ గజపతి రాజు మసీదుకు గానీ చర్చికి గానీ ఎప్పుడూ వెళ్లలేదా అని నిలదీశారు.
Also Read: అశోక్ గజపతి రాజుకు షాక్ పెద్ద కుట్ర: సంచయితకు షో కాజ్ నోటీస్
ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ కావడానికి తనకు అన్ని అర్హతలున్నాయని ఆమె అన్నారు. తమ తాతగారు పీవీజీ రాజు వారసత్వాన్ని కొనసాగించడానికి తనకు అన్ని హక్కులు ఉన్నాయని స్పష్టం చేశారు. అదితికి ట్రస్ట్ బోర్డులో అవకాశం కల్పించారని, ఆ రోజు తాను గుర్తుకు రాలేదా అన్నారు. అదితికి ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించి తనను ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు.
రాజకీయ సాధికారిత కోసం పనిచేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, టీడీపీ నాయకులు ఓ మహిళ ఎదుగుదలను ప్రశ్నిస్తున్నారని, రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని, ఇది పూర్తి ట్రస్ట్ విషయమని ఆమె అన్నారు. చీకటి జీవోల ద్వారా తాను చైర్ పర్సన్ అయినట్లు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అంటూ పట్టపగలు, అందరి సమక్షంలో ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ అయ్యానని అన్నారు. ప్రభుత్వానికి, మంత్రులకు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్తే రాజకీయ కోణంలో చూస్తున్నారని ఆమె అన్నారు
Also Read: మాన్సాస్ ట్రస్ట్ వివాదం... మండిపడుతున్న అశోక్ గజపతి రాజు