అశోక్ గజపతి రాజుకు షాక్ పెద్ద కుట్ర: సంచయితకు షో కాజ్ నోటీస్
సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ గా సంచయితను నియమించడంపై బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అశోక గజపతి రాజును పక్కన పెడుతూ ఆమెను చైర్ పర్సన్ చేయడంపై ఆయన మండిపడ్డారు.
విశాఖపట్నం: సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ గా సంచయితను నియమించడం వెనక పెద్ద కుట్ర ఉందని బిజెపి ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆరోపించారు దాని కోసం అర్థరాత్రి జీవోలు జారీ చేశారని, దాన్ని బట్టి పట్టపగలే దోపిడీకి సిద్ధపడినట్లుగా ఉందని ఆయన అన్నారు.
గత నెల 29వ తేదీన సింహాచలం ట్రస్ట్ బోర్డు ప్రభుత్వం నియమించిందని, అశోక్ గజపతిరాజును ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పేర్కొందని ఆయన గుర్తు చేస్తూ ఆ తర్వాత సంచయితతో చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయించారని ఆయన అన్నారు. ఆ జీవోలను ఇప్పటి వరకు బయట పెట్టలేదని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఇది చేశారని ఆయన అన్నారు.
పార్టీ నేతలు విష్ణుకుమార్ రాజు, కాశీ విశ్వనాథ రాజు, రవీంద్రలతో కలిసి ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సింహాచలం దేవస్థానానికి పది వేల ఎకరాల భూముులు, పద్మనాభంలోని ఆలయానికి 2,500 ఎకరాల భూములు ఉన్నాయని, ట్రస్టు పరిధిలో నాలుగు జిల్లాల్లో 105 ఆలయాలున్నాయని, వాటి భవిష్యత్తు ప్రస్తుత పరిణామంతో అగమ్యగోచరంగా మారిందని ఆయన అన్నారు.
మాన్సాస్ ట్రస్ట్ దేశంలోనే అతి పెద్దదని, 14,500 ఎకరాల భూములున్నాయని, పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్నారని, ఆ భూములపై వైసీపీ కన్నేసిందని, అందుకే దొడ్డిదారిన సంచయితను చైర్ పర్సన్ ను చేసిందని ఆయన అన్నారు. విశాఖలో సెంట్రల్ జైలు ఏర్పాటు కోసం భములు తీసుకున్నారని, అందుకు ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన అన్నారు.
సంచయితకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు సంచయిత బిజెపి యువమోర్చా నాయకురాలు మాత్రమే కాకుండా ఢిల్లీ అధికార ప్రతినిధి కూడా. ఆమె అశోక్ గజపతి రాజు సోదరుడు ఆనంద గజపతిరాజు కూతురు. సంచయితను సస్పెండ్ చేయాలని తాము అధిష్టానానికి లేఖ రాశామని మాధవ్ చెప్పారు.
వైసీపీ రాక్షస క్రీడ ఆడుతోందని విష్ణుకుమార్ రాజు అన్నారు. సంచయిత విజయనగరంలో ఎంత కాలం నుంచి ఉంటున్నారని, సింహాచలం ఎన్నిసార్లు వచ్చారని, ఆమెకు దేవస్థానంపై ఉన్న అవగాహన ఏమిటని ఆయన అడిగారు. ఇది చిన్న విషయం కాదని, గజపతుల వంశానికి చెందిన విషయమని వదిలేయలేమని ఆయన అన్నారు.